సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన 63 మంది అభ్యర్ధుల్లో రూ 122 కోట్ల సగటు ఆస్తులతో 87 శాతం మంది కోటీశ్వరులే. 63 మంది అభ్యర్థుల్లో 55 మంది కోటీశ్వరులే (రూ కోటికి పైగా ఆస్తులు) అయినా కొద్దిమంది అత్యంత సంపన్నుల ఆస్తుల కారణంగా సగటు ఆస్తుల్లో భారీ పెరుగుదల చోటుచేసుకుందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. రాజ్యసభ అభ్యర్ధుల్లో జేడీ(యూ)కు చెందిన మహేంద్ర ప్రసాద్ రూ 4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభ బరిలో ఉన్న జయాబచ్చన్ రూ 1001 కోట్ల ఆస్తులు ప్రకటించి తర్వాతి స్ధానంలో ఉన్నారు. కాగా కేవలం రూ 4 లక్షల ఆస్తులతో బిజూ జనతాదళ్‌కు చెదిన అచ్యుతానంద సమనంతా నిరుపేద అభ్యర్థి కావడం గమనార్హం.
బీజేపీ అభ్యర్థి సమీర్ ఓరాన్ రూ 18 లక్షల ఆస్తులతో ఆయన తర్వాత తక్కువ ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రధాన పార్టీల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న 29 మందిలో 26, కాంగ్రెస్ నుంచి 11 మంది అభ్యర్ధుల్లో 10, తృణమూల్ అభ్యర్ధుల్లో నలుగురికి గాను ముగ్గురు, టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులూ , జేడీ(యూ)కు చెందిన ఇద్దరు అభ్యర్ధులూ రూ కోటికి పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక పార్టీలవారీగా చూస్తూ ప్రతి అభ్యర్థి సగటు నికర ఆస్తులు బీజేపీ 29 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి రూ 16 కోట్లు కాగా, 11 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ 66 కోట్లు, నలుగురు తృణమూల్ అభ్యర్ధుల సగటు ఆస్తులు అతి తక్కువగా రూ కోటి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment