- తమిళనాడు ఎన్నికల సమయంలో పట్టుబడిన మూడు కంటైనర్లపై కేసు
- సీబీఐ అధికారి వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన రూ.570 కోట్ల నగదు రవాణా కంటైనర్ లారీలకు విశాఖపట్నానికి చెందిన మోటార్ బైక్‌ల నంబర్లు వినియోగించినట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. అప్పట్లో తిరుపూరు జిల్లాలో పట్టుబడిన ఈ మూడు కంటైనర్లను చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు విడిపించుకెళ్లారు. కంటైనర్లలో నగదు రవాణా వెనుక ఏదో కుట్ర ఉందని డీఎంకే అనుమానించింది.
డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ సీబీఐ విచారణ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటైనర్ల కేసును విచారించాల్సిందిగా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తులో తేలిన కొన్ని నిజాలను ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు బయటపెట్టారు. ఆ మూడు కంటైనర్లు (ఏపీ13 ఎక్స్ 5204, ఏపీ 13 ఎక్స్ 8650, ఏపీ 13 ఎక్స్ 5203) విశాఖపట్నంలోని ఒక ట్రాన్స్‌పోర్టు క్యారియర్ వారి మోటార్ బైక్‌ల కోసం జారీ చేసినట్లు తెలుసుకున్నామన్నారు.
ఈ కేసు వ్యవహారంలో ఇంకా ఒక నిర్ణయానికి రాకున్నా నగదు రవాణా వెనుక ఏదో అక్రమం దాగి ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.570 కోట్లను విడిపించుకునేందుకు ఎస్‌బీఐ అధికారులు 24 గంటల సమయం తీసుకోవడంలోనూ ఏదో మతలబు ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కంటైనర్లకు కాపలాగా అనుసరించిన వ్యక్తుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, అందులోని సంభాషణలను విశ్లేషించనున్నట్లు తెలిపారు.
ఏపీ నకిలీ నంబర్ ప్లేట్లతో 570 కోట్ల రవాణా
Published Thu, Jul 21 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement
Advertisement