తమిళనాడు: సాధారణంగా ఎన్నికలంటే ఓటుకు వెయ్యి నోటు ఇస్తారు గానీ ఏకంగా కోట్లిస్తానంటున్నాడు మధురైలోని ఓ మహానుభావుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో, ఓ తమిళ తంబి హామీలను చూస్తే ఎవరికైనా షాక్‌తో దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. తనను గెలిపిస్తే ప్రజలను షికారుకి తీసుకెళ్తా అంటున్నాడు. షికారు అంటే పక్క రాష్ట్రమో, లేదా పొరుగు దేశమో కాదండి, ఏకంగా చంద్రుని పైకే ట్రిప్ అంట. తులమ్ శరవణన్ మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నఒక స్వతంత్ర అభ్యర్థి. ఇతని వెరైటీ వాగ్దానాల జాబితాలో మినీ-హెలికాప్టర్, ప్రతి ఇంటికి ఒక కోటి వార్షిక డిపాజిట్, వివాహాలకు బంగారు ఆభరణాలు, మూడు అంతస్థుల ఇల్లు, చంద్రుని పర్యటన ఉన్నాయి.
తన మ్యానిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ బాబు అంతటి ఆగలేదు గృహిణుల పనిభారాన్ని తగ్గించే రోబోట్, ప్రతి కుటుంబానికి ఒక పడవ, తన నియోజకవర్గ ప్రజలను చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం ఏర్పాటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంకేముంది ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. కాగా తన హామీల వెనుక దాగున్న అంతర్యాన్ని మీడియాతో పంచుకున్నాడు.
ఇంకైనా ప్రజలు తెలుసుకోవాలి
మరీ వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ హామీల గురించి అతను ఏమంటున్నాడంటే. ఎన్నికలంటే చాలు అభ్యర్థుల నోటి నుంచి హామీలు వర్షాకాలంలో వరదల్లా వస్తుంటాయ్ అవి ఆచరణకు సాధ్యమున్నా కాకపోయినా, అందుకే ప్రజలు మాటల అభ్యర్థులను కాకుండా చేతల అభ్యర్థులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని అందుకే ఈ వెరైటీ హామీలని శరవణన్ చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు పని చేయడం లేదు. రాజకీయ నాయకులు " పనితో కాకుండా వారి మనీతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు" నా ఈ హామీలను చూసైనా ప్రజల్లో మార్పు రావాలని అందుకే ఈ ప్రయత్నమంటూ చెప్పాడు. శరవణన్ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అతని స్నేహితులు, బంధువులు సహాయం చేస్తున్నారు. అతను మాట్లాడుతూ "నా వాట్సాప్ మెసెజ్ వైరల్ అయ్యింది, ప్రజలు ప్రస్తుతం నా వెరైటీ వాగ్దానాలను, దాని వెనుక దాగున్న అంతర్యాన్ని ఆలోచిస్తున్నారు. నేను గెలవకపోయినా ఇదే నా విజయంగా భావిస్తానని తెలిపాడు. ( చదవండి : ఒక ఓటు.. రూ.2 లక్షలు )
Comments
Please login to add a commentAdd a comment