బీజేపీలో చేరిన రామ్ మాధవ్
ఏపీ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ రామ్ మాధవ్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో అధ్యక్షుడు అమిత్‌షా ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేతలు రాంలాల్, జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని రామ్ మాధవ్ ఈ సందర్భంగా చెప్పారు. ‘ఏ బాధ్యతలిచ్చినా స్వీకరిస్తా, బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తా’’నన్నారు. రామ్ మాధవ్ తూర్పుగోదావరి జిల్లా అమలా పురంకు చెందిన వారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసిన సూర్య నారాయణమూర్తి, జానకీదేవిల తొలి సంతానం ఈయన. తన సొంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పార్టీ అభివృద్ధికి జరిగే కృషిలో భాగస్వామినవుతానన్నారు. త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో చక్కని బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెచ్చారని, అన్నిరంగాలకు న్యాయం చేశారని, పదేళ్ల తరువాత సఫలమైన బడ్జెట్ వచ్చిందని, ఇది జైట్లీ సామర్థ్యానికి నిదర్శనమని రామ్ మాధవ్ అన్నారు.