ఉప ఎన్నికలు: అధికారానిదే హవా! | Ruling parties wins in By polls | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలు: అధికారానిదే హవా!

Published Tue, Aug 29 2017 3:03 AM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM

Ruling parties wins in By polls

  • ఉప ఎన్నికల్లో సాధారణంగా పాలకపక్షానికే మొగ్గు
  • 2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలు చెబుతున్నదిదే..
  • దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికారపక్షమే గెలుపొందడం రివాజుగా వస్తోంది.ఏవైనా ప్రత్యేక సందర్భాలు, డిమాండ్ల నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలు మినహా సాధారణంగా అధికార పార్టీలే నెగ్గుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సహా దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు సోమవారం వెల్లడైన ఫలితాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. అయితే ఇలా ఉప ఎన్నికల్లో గెలిచిన అధికారపక్షాలు ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలనే చవి చూస్తుండటం గమనార్హం.

    2014 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా.. అధికార సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 9 సీట్లను గెలుపొందింది. ఈ అన్ని స్థానాలూ అప్పుడు ఆ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలే కావడం గమనార్హం. కానీ 2017లో జరిగిన సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి అఖిలేశ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఇక ప్రత్యేక పరిస్థితులు, డిమాండ్లతో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు విపక్షంలో ఉన్న పార్టీలు ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నా.. తర్వాతి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయాయి.

    తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వరుసగా విజయం సాధిస్తూ వచ్చినా.. సాధారణ ఎన్నికల్లో మాత్రం గెలుపొందలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికలలో విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 15 స్థానాల్లో గెలుపొందింది. కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

    సానుకూలతలన్నీ అధికార పక్షానికే..!
    మొత్తంగా చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా జరి గిన ఉప ఎన్నికలలో అధికారపక్షాలే ఎక్కువగా విజయం సాధించాయి. 2014 జనవరి నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే.. దేశంలో 134 ఉప ఎన్నికలు జరగ్గా 95 చోట్ల అధికారపక్షమే గెలిచింది. అంటే 70 శాతానికిపైగా స్థానాల్లో అధికారపక్షాలే విజయం సాధించాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఉప ఎన్నికలంటే సాధారణ ఎన్ని కలకు సంబంధం లేకుండా, దాదాపుగా ప్రభుత్వం మార్పు జరిగే అవకాశ మేమీ లేకుండా జరుగుతాయి. అంతేగాకుండా అధికారపక్షాలు నయానో, భయానో తమ అభ్యర్థికి ఓట్లు పడే పరిస్థితిని కల్పిస్తుంటాయి.

    పోలీసులను, ఇతర ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని విపక్షాల నేతలు, కార్య కర్తలను తమ దారికి తెచ్చుకోవడం.. అధికార పక్షానికి ఓటేయకపోతే అభివృద్ధి పనులు నిలిపేస్తామన్న హెచ్చరికలు చేయడం జరుగు తుంటాయి. దీంతో ఎలాగూ రాష్ట్రంలో ప్రభు త్వం మారదు కాబట్టి.. అధికారపక్షానికి కోపం తెప్పించడం ఎందుకన్న ధోరణితో ఓటర్లు వ్యవహరించే అవకాశాలు ఎక్కువ. ఇక అధి కారపక్షాలకు ఉన్న మరో సానుకూలాంశం.. అప్పటికప్పుడు ప్రాజెక్టులు, పథకాలను ప్రక టించి జనాన్ని తమవైపునకు తిప్పుకోవడం. అవసరమైతే వెంటవెంటనే శంకుస్థాపనలు చేయడం కూడా అందులో భాగమే.

    సాధారణ ఎన్నికల్లో మారే పరిస్థితి
    అధికారపక్షానికి ఎన్ని సానుకూలత లున్నా.. ఎన్ని తాయిలాలూ చూపించినా.. సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోతుంటాయి. ప్రజలు మాత్రం తాము కోరుకున్న పార్టీకే ఓటేయడానికి మొగ్గుచూపుతారు. ప్రభుత్వంపై సహజంగా వచ్చే వ్యతిరేకత, అధికారపక్ష ఒంటెత్తు పోకడలకు చెక్‌ పెట్టే అవకాశం, ప్రభుత్వం మారిపోయి తాము కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం, విపక్షాలు కూడా తమ శక్తులన్నీ ఒడ్డి పోరాడటం వంటివి ఇందుకు కారణమవుతాయి.

    అన్ని వనరులనూ ఉపయోగించుకుని..
    సాధారణంగానే అధికారపక్షానికి ఆర్థిక, అంగబలాలు ఎక్కువగా ఉంటాయి. ఉప ఎన్నికలు జరిగే కొద్ది నియోజకవర్గాల్లోనే ఆ వనరులన్నింటినీ కేంద్రీకరించడం, నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారం చేస్తూ హామీలు గుప్పించడం కూడా ఓటర్లపై ప్రభావం చూపుతుంటుంది. దీనికితోడు డబ్బు, ఇతర ‘బహుమతు’లతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం అధికారపక్షాలకే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సహజంగానే అధికార పక్షాలు ఉప ఎన్నికల్లో గెలుపొందుతుంటాయి.

    2008లో తెలంగాణ సెంటిమెంటును బలపర్చడానికి 16 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఏడుగురే నెగ్గారు. జనంలో సెంటి మెంటు బలంగా ఉన్నా.. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌ 5 స్థానాల్లో నెగ్గింది. తమిళనాడులో 1980 నుంచి 2012 వరకు తీసుకుంటే మొత్తం 44 ఉప ఎన్నికలు జరిగితే... ఎనిమిదింటిలో మాత్రమే విపక్షాలు గెలిచాయి. మిగతా 36 స్థానాల్లో అధికార పక్షమే నెగ్గింది. సోమవారం 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగగా... గోవాలో పనాజీ, వాల్పోయి స్థానాల్లో అధికార బీజేపీ, ఢిల్లీలోని బవానా నియోజక వర్గంలో అధికార ఆప్, ఏపీలోని నంద్యాలలో అధికార టీడీపీ నెగ్గాయి.

    2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలు, ఫలితాలను పరిశీలిస్తే..

    • 2014 ఏకంగా 65 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీ అయి.. ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 65 స్థానాల్లో 44 చోట్ల ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే నెగ్గాయి. 21 చోట్ల విపక్షాలు గెలిచాయి.
    • 2015లో 23 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా.. 18 స్థానాల్లో అధికారపక్షమే నెగ్గింది. 5 స్థానాల్లో విపక్షాలు గెలిచాయి.
    • 2016లో 24 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 28 స్థానాల్లో 21 చోట్ల అధికార పక్షమే నెగ్గింది. అంటే 75 శాతం అధికారపక్షానిదే విజయం. ఏడుచోట్ల విపక్షాలు నెగ్గాయి. అధికారపక్షాలు నెగ్గిన 21 స్థానాల్లో ఐదుసీట్లు ఇతర పార్టీల నుంచి గెల్చుకున్నవి కావడం గమనార్హం. తెలంగాణలోని పాలేరు, నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వికాగా.. ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ వాటిని కైవసం చేసుకుంది. అలాగే త్రిపురలోని బర్జాలా, గుజరాత్‌లోని తలాలా, మధ్యప్రదేశ్‌లోని మైహర్, కర్ణాటకలోని బీదర్‌లలో విపక్షాల సీట్లను అధికారంలో ఉన్న పార్టీలు గెల్చుకున్నాయి.
    • ఈ ఏడాది(2017)లో ఇప్పటివరకు ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కలిపి.. రెండు లోక్‌సభ సీట్లు, 16 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల పాలకపక్షాలే అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నాయి. గోవా, నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 16 అసెంబ్లీ సీట్లకుగాను.. పాలకపక్షాలు 12 సీట్లు గెల్చుకున్నాయి. ప్రతిపక్షాలకు నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. జమ్మూ కశ్మీర్, కేరళలోని ఒక్కో లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాలు గెలిచాయి.

    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement