'వారి సినిమాల్నిబహిష్కరించాలి'
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ద్వారా హింసాత్మక సంస్కృతిని పెంపొందిస్తున్నారని, యువత దానికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు.'మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యువకుణ్ని ప్రశ్నించాను. జీవితంలో ఏమవ్వాలని అనుకుంటున్నావని అడిగాను. దానికి ఆ యువకుడు అమీర్, షారుఖ్ , సల్మాన్ ఖాన్ తరహాలో నటుణ్ని అవ్వాలనుకుంటున్నాఅని బదులిచ్చాడు.
ఎందుకు అలా అవ్వాలని అనుకుంటున్నావని అడిగితే.. వారు స్టంట్స్ బాగా చేస్తారని ఆ యువకుడి తల్లి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే వారు హింసను ప్రోత్సహిస్తున్నారని అర్ధమవుతోంది.అందుకే యువత వారికి ఆకర్షితులవ్వకూడదని సూచిస్తున్నా'అని ప్రాచీ తెలిపారు.