ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు! | Sakshi Misra Did Not Run Away Only For Love | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

Published Wed, Jul 17 2019 2:17 PM | Last Updated on Wed, Jul 17 2019 4:57 PM

Sakshi Misra Did Not Run Away Only For Love

సాక్షి, న్యూఢిల్లీ : ‘నాకు ఎన్నో కలలు ఉండేవి. నాకు ఇష్టమైన చదువు చదువుకోవాలనుకున్నాను. బయటకు వెళ్లి ఏదో ఉద్యోగం చేయాలనుకున్నాను. దేన్ని మా నాన్న ఒప్పుకోలేదు. చివరకు నా అన్న విక్కీలాగ నాన్న ఆఫీసులోనే పనిచేయాలనుకున్నాను. అక్కడికి వచ్చే ప్రజల సమస్యల గురించి ఆసక్తిగా తెలుసుకోవాలనుకున్నాను. దాన్ని నాన్న పట్టించుకోలేదు. నాకు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదు. అసలు నేను ఉన్నత చదువులు చదువుకోవడమే నాన్నకు ఇష్టం లేదు. చివరకు ‘మాస్‌ కమ్యూనికేషన్‌’లో చేర్చారు, అదీ మొబైల్‌ ఫోన్లను అనుమతించని కాలేజీలో. అదే అన్న విక్కీకి చిన్నప్పటి నుంచి అన్నింట్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నేను, నా చెల్లి ఆడవాళ్లం అవడం పట్ల మమ్మల్ని భిన్నంగానే చూస్తూ వచ్చారు. ఆడదాన్ని అవడం వల్లనే కుటుంబం పరువు పోతుందని అనుకుంటే పొరపాటు. రేపు అన్న వల్ల కూడా నాన్న పరువు పోవచ్చు. ఇలా మగవాళ్లను ఒకలాగా, ఆడవాళ్లను ఒకలాగా చూసే నాన్న మనస్తత్వం మారాలని కోరుకుంటున్నాను’ అని సాక్షి మిశ్రా వివిధ టీవీ ఛానళ్ల ముందు వాపోయారు. 

చదవండి: మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు

ఆమె ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆమె ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్‌ మిశ్రా  కూతురు సాక్షి మిశ్రా. 23 ఏళ్ల ఆమె దళిత యువకుడైన అజితేష్‌ కుమార్‌ను జూలై నాలుగవ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమను చంపేసేందుకు తన తండ్రి, అన్న విక్కీ, వాళ్ల అనుచరుడు రాజీవ్‌ రాణా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సోషల్‌ మీడియా ద్వారా రెండు వీడియోలను విడుదల చేశారు. తమకు పోలీసు రక్షణ కల్పించాల్సిందిగా అందులో ఆ జంట కోరింది. తాము రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే వారి ఆచూకీ ఇంత వరకు దొరకలేదని యూపీ పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఈలోగా పరారీలో ఉన్న ఆ దంపతులను వెతికి పట్టుకున్న పలు హిందీ టీవీ ఛానళ్లు వారిని ఇంటర్వ్యూ చేశాయి. సాక్షి మిశ్రా తన తండ్రి గురించి చేసిన అన్ని ఆరోపణలను ఆమె తండ్రి రాజేష్‌ మిశ్రా అవే ఛానళ్ల ముఖంగా ఖండిస్తూ వచ్చారు. 

చివరకు మీ తండ్రికి మీరివ్వాలనుకుంటున్న సందేశం ఏమిటని ‘ఆజ్‌తక్‌’ లాంటి ఛానళ్లు అడిగినప్పుడు ఒక్కసారిగా ఆమె ఏడ్చారు. కాసేపటికి తేరుకున్నాక తాను బాలికవడం వల్ల తన బాల్యం అంతా కుటుంబం ఆంక్షల మధ్యనే గడిచిందని చెప్పుకొచ్చారు. ఆ వివక్షను మాత్రం ఆమె తండ్రి ఖండించలేకపోయారు. బాలికల పట్ల అలా వివక్ష చూపడం మంచిదేఅని ఆయన భావించి ఉండవచ్చు. ఇలా ఆడవారి పట్ల వివక్ష అనేది ఒక్క యూపీ రాష్ట్రానికో, ఓ కులానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ కులాల్లో, వివిధ వర్గాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకంగా బాలికల చదువు కోసం, ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం పలు స్కీములను అమలు చేస్తున్నా ప్రజల్లో పెద్దగా మార్పు రావడం లేదు. బాలికలకు తక్కువ పోషకాలు, తక్కువ స్వేచ్ఛనే ఇస్తున్నారు. చదువు, విద్యా విషయాల్లో కూడా వారికి స్వేచ్ఛ తక్కువే. 

దేశంలో కౌమార దశకు వచ్చిన బాలికల్లో 40 శాతం మంది చదువు కోవడం లేదని, వారు ఇంటి పనులకే అంకితం అవుతున్నారని ఇటీవల విడుదలైన ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌–2018’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంతో పోలిస్తే మహిళా కార్మిక శక్తి కూడా గణనీయంగా పడిపోతూ 2018 నాటికి 26 శాతానికి చేరుకుందని ఆ నివేదిక తెలియజేసింది. పురుషుల్లో 71 శాతం మంది మొబైల్‌ ఫోన్లు ఉండగా, మహిళల్లో 38 శాతం మందికే మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని ‘హార్వర్డ్‌ యూనివర్శిటీ’ గతేడాది భారత్‌లో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడయింది. 

సోషల్‌ మీడియాలో సాక్షి మిశ్రానే ఎక్కువ మంది తప్పుపట్టారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవడం భారతీయ సంస్కతి అని, ఆ సంస్కతిని ఉల్లంఘించడం, తల్లిదండ్రుల పరువు దీయడం ముమ్మాటికి తప్పేనంటూ తప్పుపట్టారు. సాక్షి మిశ్రాను బాధితురాలుగా చూపించడం, ఆమె వాదనకు ప్రాముఖ్యతను ఇవ్వడం కూడా తప్పేనంటూ టీవీ ఛానళ్లపైనా వారు విరుచుకుపడుతున్నారు. బాలికలు ఇళ్ల నుంచి పారిపోవడానికే టీవీ ఇంటర్వ్యూలు దోహదపడతాయని వారంటున్నారు. వారి వాదనతో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యే గోపాల్‌ భార్గవ కూడా ఏకీభవిస్తూ వరుస ట్వీట్లు చేశారు. దేశంలో బ్రూణ హత్యలు, ఆడ శిశువు హత్యలు మరింతగా పెరుగుతాయని, తద్వారా దేశంలో స్త్రీ, పురుషుల మధ్య సంఖ్యా వ్యత్యాసం మరింత పెరుగుతుందని అన్నారు. చెడు తిరుగుళ్ల వల్ల బ్రూణ హత్యలు పెరుగుతాయని, ఆడ పిల్ల పుడితే భవిష్యత్తులో తమ మాట వినరనే ఉద్దేశంతో చిన్నప్పుడే తల్లిదండ్రులు చంపేస్తారని బీజేపీ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆలోచనా ధోరణి సమాజంలో మారనంత కాలం సాక్షి మిశ్రా లాంటి కథలను వింటూనే ఉంటాం. 

చదవండి: సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement