Rajesh Mishra
-
ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నాకు ఎన్నో కలలు ఉండేవి. నాకు ఇష్టమైన చదువు చదువుకోవాలనుకున్నాను. బయటకు వెళ్లి ఏదో ఉద్యోగం చేయాలనుకున్నాను. దేన్ని మా నాన్న ఒప్పుకోలేదు. చివరకు నా అన్న విక్కీలాగ నాన్న ఆఫీసులోనే పనిచేయాలనుకున్నాను. అక్కడికి వచ్చే ప్రజల సమస్యల గురించి ఆసక్తిగా తెలుసుకోవాలనుకున్నాను. దాన్ని నాన్న పట్టించుకోలేదు. నాకు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదు. అసలు నేను ఉన్నత చదువులు చదువుకోవడమే నాన్నకు ఇష్టం లేదు. చివరకు ‘మాస్ కమ్యూనికేషన్’లో చేర్చారు, అదీ మొబైల్ ఫోన్లను అనుమతించని కాలేజీలో. అదే అన్న విక్కీకి చిన్నప్పటి నుంచి అన్నింట్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నేను, నా చెల్లి ఆడవాళ్లం అవడం పట్ల మమ్మల్ని భిన్నంగానే చూస్తూ వచ్చారు. ఆడదాన్ని అవడం వల్లనే కుటుంబం పరువు పోతుందని అనుకుంటే పొరపాటు. రేపు అన్న వల్ల కూడా నాన్న పరువు పోవచ్చు. ఇలా మగవాళ్లను ఒకలాగా, ఆడవాళ్లను ఒకలాగా చూసే నాన్న మనస్తత్వం మారాలని కోరుకుంటున్నాను’ అని సాక్షి మిశ్రా వివిధ టీవీ ఛానళ్ల ముందు వాపోయారు. చదవండి: మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు ఆమె ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆమె ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా. 23 ఏళ్ల ఆమె దళిత యువకుడైన అజితేష్ కుమార్‌ను జూలై నాలుగవ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమను చంపేసేందుకు తన తండ్రి, అన్న విక్కీ, వాళ్ల అనుచరుడు రాజీవ్ రాణా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సోషల్ మీడియా ద్వారా రెండు వీడియోలను విడుదల చేశారు. తమకు పోలీసు రక్షణ కల్పించాల్సిందిగా అందులో ఆ జంట కోరింది. తాము రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే వారి ఆచూకీ ఇంత వరకు దొరకలేదని యూపీ పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఈలోగా పరారీలో ఉన్న ఆ దంపతులను వెతికి పట్టుకున్న పలు హిందీ టీవీ ఛానళ్లు వారిని ఇంటర్వ్యూ చేశాయి. సాక్షి మిశ్రా తన తండ్రి గురించి చేసిన అన్ని ఆరోపణలను ఆమె తండ్రి రాజేష్ మిశ్రా అవే ఛానళ్ల ముఖంగా ఖండిస్తూ వచ్చారు. చివరకు మీ తండ్రికి మీరివ్వాలనుకుంటున్న సందేశం ఏమిటని ‘ఆజ్‌తక్’ లాంటి ఛానళ్లు అడిగినప్పుడు ఒక్కసారిగా ఆమె ఏడ్చారు. కాసేపటికి తేరుకున్నాక తాను బాలికవడం వల్ల తన బాల్యం అంతా కుటుంబం ఆంక్షల మధ్యనే గడిచిందని చెప్పుకొచ్చారు. ఆ వివక్షను మాత్రం ఆమె తండ్రి ఖండించలేకపోయారు. బాలికల పట్ల అలా వివక్ష చూపడం మంచిదేఅని ఆయన భావించి ఉండవచ్చు. ఇలా ఆడవారి పట్ల వివక్ష అనేది ఒక్క యూపీ రాష్ట్రానికో, ఓ కులానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ కులాల్లో, వివిధ వర్గాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకంగా బాలికల చదువు కోసం, ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం పలు స్కీములను అమలు చేస్తున్నా ప్రజల్లో పెద్దగా మార్పు రావడం లేదు. బాలికలకు తక్కువ పోషకాలు, తక్కువ స్వేచ్ఛనే ఇస్తున్నారు. చదువు, విద్యా విషయాల్లో కూడా వారికి స్వేచ్ఛ తక్కువే. దేశంలో కౌమార దశకు వచ్చిన బాలికల్లో 40 శాతం మంది చదువు కోవడం లేదని, వారు ఇంటి పనులకే అంకితం అవుతున్నారని ఇటీవల విడుదలైన ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–2018’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంతో పోలిస్తే మహిళా కార్మిక శక్తి కూడా గణనీయంగా పడిపోతూ 2018 నాటికి 26 శాతానికి చేరుకుందని ఆ నివేదిక తెలియజేసింది. పురుషుల్లో 71 శాతం మంది మొబైల్ ఫోన్లు ఉండగా, మహిళల్లో 38 శాతం మందికే మొబైల్ ఫోన్లు ఉన్నాయని ‘హార్వర్డ్ యూనివర్శిటీ’ గతేడాది భారత్‌లో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడయింది. సోషల్ మీడియాలో సాక్షి మిశ్రానే ఎక్కువ మంది తప్పుపట్టారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవడం భారతీయ సంస్కతి అని, ఆ సంస్కతిని ఉల్లంఘించడం, తల్లిదండ్రుల పరువు దీయడం ముమ్మాటికి తప్పేనంటూ తప్పుపట్టారు. సాక్షి మిశ్రాను బాధితురాలుగా చూపించడం, ఆమె వాదనకు ప్రాముఖ్యతను ఇవ్వడం కూడా తప్పేనంటూ టీవీ ఛానళ్లపైనా వారు విరుచుకుపడుతున్నారు. బాలికలు ఇళ్ల నుంచి పారిపోవడానికే టీవీ ఇంటర్వ్యూలు దోహదపడతాయని వారంటున్నారు. వారి వాదనతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యే గోపాల్ భార్గవ కూడా ఏకీభవిస్తూ వరుస ట్వీట్లు చేశారు. దేశంలో బ్రూణ హత్యలు, ఆడ శిశువు హత్యలు మరింతగా పెరుగుతాయని, తద్వారా దేశంలో స్త్రీ, పురుషుల మధ్య సంఖ్యా వ్యత్యాసం మరింత పెరుగుతుందని అన్నారు. చెడు తిరుగుళ్ల వల్ల బ్రూణ హత్యలు పెరుగుతాయని, ఆడ పిల్ల పుడితే భవిష్యత్తులో తమ మాట వినరనే ఉద్దేశంతో చిన్నప్పుడే తల్లిదండ్రులు చంపేస్తారని బీజేపీ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆలోచనా ధోరణి సమాజంలో మారనంత కాలం సాక్షి మిశ్రా లాంటి కథలను వింటూనే ఉంటాం. చదవండి: సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన -
‘ప్రేమ’ లేకుండా పోదు
కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితో పాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా తండ్రి గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తు లేకుండా అయితే పోదు. నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉండేదే. నాన్న నిద్ర లేస్తాడు. కళ్లు తెరవగానే బంగారు తల్లి కనిపించాలి. నాన్న బయటి నుంచి వస్తాడు. రాగానే బంగారు తల్లి కనిపించాలి. సూర్యుడు, చంద్రుడు అని పైన ఇద్దరు ఉంటారు కదా.. లోకానికి బాగా కావలసినవాళ్లు.. వాళ్లు అక్కర్లేదు ఆయనకు! వెలుగూ కూతురే, వెన్నెలా కూతురే. అమ్మ మోయడం కనిపించేది ఆ తొమ్మిది నెలలే. తర్వాత అంతా నాన్నే మోయడం గుండెల మీద! బరువనిపించదు. కూతురు దిగితేనే గుండె బరువెక్కుతుంది. తనకై తను కూతురు దిగాలని చూస్తోందా, కాలు కిందపెట్టాలని చూస్తోందా.. నాన్నకిక నొప్పులు మొదలు! విలవిల్లాడిపోతాడు. భద్రం తల్లీ నేల. భద్రం తల్లీ నింగి. నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. కాసేపటికే ఆయన అలా అయిపోతే, గుండెల్ని ‘తేలిక చేసి’ కూతురు కిందికి దిగిపోతే? దిగిపోతే ఎలా ఉంటుందో మిర్యాలగూడ మారుతీరావుకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు యూపీలోని రాజేశ్ మిశ్రాకు తెలుస్తోంది. బిఠారీ చైన్పూర్ ఎమ్మెల్యే ఆయన. ఆయన కూతురు సాక్షి ఈ నెల మూడున తండ్రి గుండెల మీద నుంచి దిగి పోయింది! మర్నాడే ప్రయాగరాజ్‌లోని ఒక గుళ్లో తను ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంది. అతడి పేరు అభిజిత్. దళితుడు. సాక్షి బ్రాహ్మలమ్మాయి. పైగా ఎమ్మెల్యే కూతురు. పైగా బీజేపీ ఎమ్మెల్యే కూతురు. పైగా యూపీలో పవర్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే కూతురు. రాజేశ్ మిశ్రా గుండె బరువెక్కింది ఈ ‘పైగా’ల వల్ల కాకపోవచ్చు. తెల్లారి లేచి చూస్తే గుండెలపై పిల్ల లేదు. ఊపిరెలా ఆడుతుంది ఏ తండ్రికైనా! మిర్యాలగూడ మారుతీరావు నొప్పులకు, బిఠారీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా నొప్పులకు పోలికలున్నాయి. కూతురు నడిచిన ముద్దు ముద్దు పాదాల ముద్రలు ఆ ఇద్దరి గుండెలపైనా ఇంకా అలాగే ఉన్నాయి. ఆ పాదాలకున్న గజ్జెలు ఇంకా చెవుల్లో ఘల్లుఘల్లుమంటూనే ఉన్నాయి. ఇద్దరూ సంఘంలో పరువు మర్యాదలు ఉన్నవారే. ఇద్దరూ కూతురే తమ పరువుమర్యాదగా బతుకుతున్నవారే. ఇంకొక పోలిక ఉంది కానీ అది వాళ్లు ఇష్టపడే పోలిక కాదు. మారుతీరావు కూతురు ప్రేమించిందీ దళితుడినే, రాజేశ్ మిశ్రా కూతురు ప్రేమించిందీ దళితుడినే. మున్ముందు మరొక పోలిక కూడా ఉండే ప్రమాదం ఉంది. ఇక్కడ మిర్యాలగూడలో ఈ తండ్రి ఏం చేయించాడని అనుకుంటున్నామో, అక్కడ యూపీలో ఆ తండ్రీ అదే చేయించబోయే ప్రమాదం! అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని కిరాయి హంతకులు చంపేశారు. సాక్షి ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువకుడినీ ఎవరైనా అలాగే చేయబోతారా? పది రోజులుగా సాక్షిని, అభిజిత్‌ని ఎవరో వెంటాడుతున్నారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘వాడిని చేసుకుంటావా!’ అని ఆమెను, ‘గొప్పింటి వాళ్లమ్మాయి కావాల్సి వచ్చిందా!’ అని అతడినీ వేధిస్తున్నారు. నూతన వధూవరులిద్దరికీ గట్టి భద్రత కల్పించాలని నిన్న సోమవారం అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతకన్నా ముందుగా.. వీళ్ల పెళ్లి చెల్లుబాటు అవుతుంది అని ప్రకటించింది. కోర్టు చెప్పిందని తండ్రి మనసు కుదుటపడుతుందా పెళ్లి చట్టబద్ధమైపోయింది కనుక ఇక కూతురు హ్యాపీగా ఉంటుందని?! సాక్షి తన భర్త అభిజిత్‌తో కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘నా భర్తపై కోర్టు ప్రాంగణంలోనే నల్లకోటు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని చెప్పింది సాక్షి. ‘‘నాన్నా.. మమ్మల్ని వదిలెయ్. నా భర్తకు హాని తలపెట్టకు. దూరంగా ఎటైనా వెళ్లి బతుకుతాం’’ అని అదే వీడియోలో తండ్రిని ప్రాథేయపడింది. మరొక వీడియోలో తన భార్యను ఆమె తండ్రి నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు అభిజిత్. అయితే ‘‘నా కూతురి కన్నా అతడు తొమ్మిదేళ్లు పెద్దవాడు. అంతకుమించి నా అభ్యంతరం ఏమీ లేదు’’ అంటున్నారు రాజేశ్ మిశ్రా. ఎవరిది పెద్దకష్టం? కూతురిపై ప్రేమను పెంచుకున్న తండ్రిదా? దళితుడితో ప్రేమను పంచుకున్న కూతురిదా? ఇద్దరివీ కష్టాలే. కూతురు అలా చేసినందుకు చాలా పోగొట్టుకోవాలి తండ్రి. పరువు, ప్రతిష్ట, వంశ గౌరవం.. ఇలాంటివన్నీ. అదృష్టం ఏంటంటే.. ఎన్ని పోయినా ఒకదాన్ని మాత్రం పోగొట్టుకోకుండా ఉండడం తండ్రి చేతుల్లోనే ఉంది. అది.. కూతురిపై ఆయనకున్న ప్రేమ! కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితోపాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా ఆయన గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తులేకుండా అయితే పోదు. కూతురిదీ తక్కువ కష్టమేం కాదు. తండ్రి సర్వస్వాన్నీ తను ధ్వంసం చేసి వెళ్లిన ఆ క్షణంలో.. తండ్రిని, తల్లిని, తోబుట్టువుల్ని వదిలి వచ్చేసిన ఆ క్షణంలో.. ఆమె పడే మనోవేదన తండ్రి కోసమే కానీ ఆయన అంగీకరించని తన ప్రేమ కోసం కాదు. తండ్రికి ఇష్టం లేని పని చేశానని కూతురు, కూతురి ఇష్టాన్ని మన్నించలేకపోయానని తండ్రీ.. ఎవరికి వారు మనసు కష్టపెట్టుకోవడంలో ఉండేది ఎటుతిరిగీ తండ్రీ కూతుళ్ల బంధమే! అనుబంధమే!! -మాధవ్ శింగరాజు -
వారణాసిపై ఎటూ తేల్చని కాంగ్రెస్
16 మందితో ఆరో జాబితా విడుదల మోడీపై పోటీకి రాజేష్ మిశ్రా పేరు పరిశీలన! న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆపార్టీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేరు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందో అనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ ఈ వారణాసి స్థానానికి స్థానిక నేత రాజేష్ మిశ్రా పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 2004-09 మధ్య ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మిశ్రా తాను మోడీపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే సంకేతాలు పంపారు. అయితే, మిశ్రా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీపై వారణాసి నుంచి పోటీకి తాను సిద్ధమంటూ దిగ్విజయ్ సోమవారం భోపాల్‌లో వెల్లడించారు. మరోపక్క, లోక్‌సభకు పోటీచేసే 16 మంది అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం ఇక్కడ విడుదల చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్ స్థానాన్ని ఎవరికీ కేటాయించలేదు. ఈ స్థానాన్ని ‘ఆదర్శ్’ కుంభకోణం నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం అశోక్‌చవాన్.. తనకు లేదా తన భార్యకు కేటాయించాలని కోరుతున్నారు. తెలంగాణకు చెందిన అభ్యర్థుల జాబితాపై కమిటీ బుధవారం కసరత్తు చేసి, ఈ నెల 28న జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది.