‘ప్రేమ’ లేకుండా పోదు | Special Story On BJP MLA Rajesh Mishra Daughter | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ లేకుండా పోదు

Published Tue, Jul 16 2019 8:52 AM | Last Updated on Tue, Jul 16 2019 12:02 PM

Special Story On BJP MLA Rajesh Mishra Daughter - Sakshi

ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట సాక్షి మిశ్రా, అభిజిత్‌ : మీడియాతో వీడియోలో..! 

కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితో పాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా తండ్రి గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తు లేకుండా అయితే పోదు.

నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. 

ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఉండేదే. నాన్న నిద్ర లేస్తాడు. కళ్లు తెరవగానే బంగారు తల్లి కనిపించాలి. నాన్న బయటి నుంచి వస్తాడు. రాగానే బంగారు తల్లి కనిపించాలి. సూర్యుడు, చంద్రుడు అని పైన ఇద్దరు ఉంటారు కదా.. లోకానికి బాగా కావలసినవాళ్లు.. వాళ్లు అక్కర్లేదు ఆయనకు! వెలుగూ కూతురే, వెన్నెలా కూతురే. అమ్మ మోయడం కనిపించేది ఆ తొమ్మిది నెలలే. తర్వాత అంతా నాన్నే మోయడం గుండెల మీద! బరువనిపించదు. కూతురు దిగితేనే గుండె బరువెక్కుతుంది. తనకై తను కూతురు దిగాలని చూస్తోందా, కాలు కిందపెట్టాలని చూస్తోందా.. నాన్నకిక నొప్పులు మొదలు! విలవిల్లాడిపోతాడు. భద్రం తల్లీ నేల. భద్రం తల్లీ నింగి. నేలపైనా కాకుండా, నింగిలోనూ కాకుండా తన గుండెల మీద ఉంటేనే బంగారు తల్లి భద్రంగా ఉంటుందని నాన్నకొక నమ్మకం. నిశ్చింత. జన్మనివ్వడం కోసం అమ్మ పడే నొప్పులకు తక్కువేం కాదు.. కూతురు కాసేపు కనిపించకపోతే నాన్న పడే నొప్పులు. కాసేపటికే ఆయన అలా అయిపోతే, గుండెల్ని ‘తేలిక చేసి’ కూతురు కిందికి దిగిపోతే?

దిగిపోతే ఎలా ఉంటుందో మిర్యాలగూడ మారుతీరావుకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు యూపీలోని రాజేశ్‌ మిశ్రాకు తెలుస్తోంది. బిఠారీ చైన్‌పూర్‌ ఎమ్మెల్యే ఆయన. ఆయన కూతురు సాక్షి ఈ నెల మూడున తండ్రి గుండెల మీద నుంచి దిగి పోయింది! మర్నాడే ప్రయాగరాజ్‌లోని ఒక గుళ్లో తను ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంది. అతడి పేరు అభిజిత్‌. దళితుడు. సాక్షి బ్రాహ్మలమ్మాయి. పైగా ఎమ్మెల్యే కూతురు. పైగా బీజేపీ ఎమ్మెల్యే కూతురు. పైగా యూపీలో పవర్‌లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే కూతురు. రాజేశ్‌ మిశ్రా గుండె బరువెక్కింది ఈ ‘పైగా’ల వల్ల కాకపోవచ్చు. తెల్లారి లేచి చూస్తే గుండెలపై పిల్ల లేదు. ఊపిరెలా ఆడుతుంది ఏ తండ్రికైనా! 

మిర్యాలగూడ మారుతీరావు నొప్పులకు, బిఠారీ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా నొప్పులకు పోలికలున్నాయి. కూతురు నడిచిన ముద్దు ముద్దు పాదాల ముద్రలు ఆ ఇద్దరి గుండెలపైనా ఇంకా అలాగే ఉన్నాయి. ఆ పాదాలకున్న గజ్జెలు ఇంకా చెవుల్లో ఘల్లుఘల్లుమంటూనే ఉన్నాయి. ఇద్దరూ సంఘంలో పరువు మర్యాదలు ఉన్నవారే. ఇద్దరూ కూతురే తమ పరువుమర్యాదగా బతుకుతున్నవారే. ఇంకొక పోలిక ఉంది కానీ అది వాళ్లు  ఇష్టపడే పోలిక కాదు.  మారుతీరావు కూతురు ప్రేమించిందీ దళితుడినే, రాజేశ్‌ మిశ్రా కూతురు ప్రేమించిందీ దళితుడినే. మున్ముందు మరొక పోలిక కూడా ఉండే ప్రమాదం  ఉంది. ఇక్కడ మిర్యాలగూడలో ఈ తండ్రి ఏం చేయించాడని అనుకుంటున్నామో, అక్కడ యూపీలో ఆ తండ్రీ అదే చేయించబోయే ప్రమాదం! అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని కిరాయి హంతకులు చంపేశారు. సాక్షి ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువకుడినీ ఎవరైనా అలాగే చేయబోతారా? పది రోజులుగా సాక్షిని, అభిజిత్‌ని ఎవరో వెంటాడుతున్నారు. ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారు. ‘వాడిని చేసుకుంటావా!’ అని ఆమెను, ‘గొప్పింటి వాళ్లమ్మాయి కావాల్సి వచ్చిందా!’ అని అతడినీ  వేధిస్తున్నారు. నూతన వధూవరులిద్దరికీ గట్టి భద్రత కల్పించాలని నిన్న సోమవారం అలహాబాద్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతకన్నా ముందుగా.. వీళ్ల పెళ్లి చెల్లుబాటు అవుతుంది అని ప్రకటించింది. కోర్టు చెప్పిందని తండ్రి మనసు కుదుటపడుతుందా పెళ్లి చట్టబద్ధమైపోయింది కనుక ఇక కూతురు హ్యాపీగా ఉంటుందని?! 

సాక్షి తన భర్త అభిజిత్‌తో కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘నా భర్తపై కోర్టు ప్రాంగణంలోనే నల్లకోటు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని చెప్పింది సాక్షి. ‘‘నాన్నా.. మమ్మల్ని వదిలెయ్‌. నా భర్తకు హాని తలపెట్టకు. దూరంగా ఎటైనా వెళ్లి బతుకుతాం’’ అని అదే వీడియోలో తండ్రిని ప్రాథేయపడింది. మరొక వీడియోలో తన భార్యను ఆమె తండ్రి నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు అభిజిత్‌. అయితే ‘‘నా కూతురి కన్నా అతడు తొమ్మిదేళ్లు పెద్దవాడు. అంతకుమించి నా అభ్యంతరం ఏమీ లేదు’’ అంటున్నారు రాజేశ్‌ మిశ్రా. 

ఎవరిది పెద్దకష్టం? కూతురిపై ప్రేమను పెంచుకున్న తండ్రిదా? దళితుడితో ప్రేమను పంచుకున్న కూతురిదా? ఇద్దరివీ కష్టాలే. కూతురు అలా చేసినందుకు చాలా పోగొట్టుకోవాలి తండ్రి. పరువు, ప్రతిష్ట, వంశ గౌరవం.. ఇలాంటివన్నీ. అదృష్టం ఏంటంటే.. ఎన్ని పోయినా ఒకదాన్ని మాత్రం పోగొట్టుకోకుండా ఉండడం తండ్రి చేతుల్లోనే ఉంది. అది.. కూతురిపై ఆయనకున్న ప్రేమ! కూతుర్ని గుండెలపై ఆడిస్తున్నప్పుడు కూతురితోపాటు ఆమెకు ఇష్టమైన బొమ్మా ఆయన గుండెలపై ఆడే ఉంటుంది. ఈ క్షణంలో.. కూతురు వెళ్లిపోయిన ఈ క్షణంలో.. అది ఆ తండ్రికి గుర్తుకు రాకపోవచ్చు. గుర్తులేకుండా అయితే పోదు.

కూతురిదీ తక్కువ కష్టమేం కాదు. తండ్రి సర్వస్వాన్నీ తను ధ్వంసం చేసి వెళ్లిన ఆ క్షణంలో.. తండ్రిని, తల్లిని, తోబుట్టువుల్ని వదిలి వచ్చేసిన ఆ క్షణంలో.. ఆమె పడే మనోవేదన తండ్రి కోసమే కానీ ఆయన అంగీకరించని తన ప్రేమ కోసం కాదు. తండ్రికి ఇష్టం లేని పని చేశానని కూతురు, కూతురి ఇష్టాన్ని మన్నించలేకపోయానని తండ్రీ.. ఎవరికి వారు మనసు కష్టపెట్టుకోవడంలో ఉండేది ఎటుతిరిగీ తండ్రీ కూతుళ్ల బంధమే! అనుబంధమే!! 

-మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement