ప్చ్‌... ఇదేం సాలరీ! | Salary making job holders sad | Sakshi
Sakshi News home page

ప్చ్‌... ఇదేం సాలరీ!

Published Thu, Apr 6 2017 2:28 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

ప్చ్‌... ఇదేం సాలరీ!

ప్చ్‌... ఇదేం సాలరీ!

- జీతభత్యాలపై 70 శాతం వేతనజీవుల్లో నిరాశే!
- విజ్‌డమ్‌ జాబ్స్‌డాట్‌కామ్‌ సర్వేలో వెల్లడి
- మెట్రో నగరాల్లో పది రంగాల ఉద్యోగులపై సంస్థ సర్వే
- వేతనాలపై బెంగళూరులో 63%   మంది సంతృప్తి
- 51 శాతంతో 4వ స్థానంలో హైదరాబాద్‌


సాక్షి, హైదరాబాద్‌: ప్చ్‌..ఏం ఉద్యోగమో ..ఏమో బాస్‌! వచ్చే జీతం చాలట్లేదు. ఇంటి అద్దెలు.. పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు... భారంగా మారిన నిత్యావసరాల కొనుగోళ్లు.. మెట్రో నగరాల్లో 70 శాతం వేతనజీవుల ఆందోళన ఇదేనట. ప్రముఖ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ విజ్‌డమ్‌జాబ్స్‌డాట్‌ కామ్‌ అనే సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల పలు మెట్రో నగరాల్లో వేతన జీవుల స్పందన ఆసక్తికరంగా ఉంది.

బెంగళూరు నగరంలో 63 శాతం మంది వేతనజీవులు తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉండగా... ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచిన పుణేలో 57 శాతం మంది సంతృప్తిగా ఉన్నారట. మూడో స్థానంలో ఉన్న ముంబైలో 54 శాతం మంది వేతనాల పట్ల సంతృప్తిగా ఉండగా..నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నగరంలో 51 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారట. ఇక దేశరాజధాని ఢిల్లీలో కేవలం 49 శాతం మంది మాత్రమే జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉండడం గమనార్హం. ఇక చెన్నై నగరంలో 46 శాతం మంది మాత్రమే చేస్తున్న ఉద్యోగం, జీతభత్యాల పట్ల సంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే తేల్చింది.

సర్వే చేసిన రంగాలు:
ఐటీ, టెలికాం, ఐటీఈఎస్, రిటైల్, విద్యారంగం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్‌. సంతృప్తిగా ఉన్న ఉద్యోగుల విషయంలో ఆయా మెట్రో నగరాల ర్యాంకింగ్స్‌ ఇలా ఉన్నాయి.


జీతభత్యాల్లో ఐటీరంగమే టాప్‌..
జీతభత్యాల విషయంలో ఐటీరంగం అగ్రగామిగా నిలిచింది. ఈ రంగంలో పనిచేస్తున్న 65 శాతం మంది వేతనజీవులు ప్రస్తుతం తమకు అందుతున్న జీతభత్యాల పట్ల సంతృప్తి వ్యక్తంచేయడం గమనార్హం. ఈ విషయంలో ఐటీ రంగం తరవాత మీడియా, వినోద రంగం రెండో స్థానంలో నిలిచాయి. ఈ రంగాల్లో పనిచేస్తున్న వారిలో 58 శాతం మంది తమకు అందుతున్న జీతభత్యాలపట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలడం గమనార్హం. ఆయా రంగాల్లో తమకు అందుతున్న జీతభత్యాలపై వేతనజీవుల్లో సంతృప్తి శాతం ఇలా ఉంది.

సర్వేలో తేలిన ఆసక్తికర అంశాలివే..
- సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది తమ మూల వేతనం అధికంగా ఉండాలని తెలిపారు. మరో 42 శాతం మంది అదనపు భత్యాలు, అదనపు పనికి అదనపు వేతనం, ఇతర ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.


- 80 శాతం మంది అత్యధిక వేతనాలు ఇచ్చే సంస్థల్లో పనిచేసేందుకే ఆసక్తి కనబరిచారు.

- 45 శాతం మంది ఉద్యోగులు తమతో పాటే కెరీర్‌ ప్రారంభించిన వారి కంటే తమకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయని మథనపడుతున్నారట.

- తమ పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే పథకాలు, హెల్త్‌ఇన్సూరెన్స్, రిటైర్మెంట్‌ తరవాత అందే భత్యాలపై ఆయా రంగాలకు చెందిన ఉద్యోగుల్లో సింహభాగం అసంతృప్తి వ్యక్తం చేశారు.

- 48 శాతం మంది ఉద్యోగులు పనివేళల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.

- మాతృత్వ, పితృత్వ ప్రయోజనాల పట్ల కేవలం 30 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు.

- రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో 28 శాతం మందికి మాత్రమే సంతృప్తి ఉంది.

- మహిళా ఉద్యోగులు మాత్రం జీతభత్యాలతోపాటు ఆరోగ్య బీమా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఉండాలని భావిస్తున్నారు. వేతనంతోపాటే ఇవీ ముఖ్యమేనని పేర్కొన్నారు.

- విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది తమకు లభిస్తున్న జీతభత్యాల పట్ల అసంతృప్తిగా ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement