ముంబై : లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్ షాపులు మరోసారి మూతపడ్డాయి. ఓవైపు కరోనా వ్యాధి విస్తరిస్తుండటం, మరోవైపు భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపించడంతో ముంబై మున్సిపల్ అధికారులు చేసేదేమీ లేక మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీంతో బుధవారం నుంచి ముంబైలో మద్యం దుకాణాలతోపాటూ నిత్యావసరాలుకాని దుకాణాలు కూడా మూసివేశారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర)
లాక్‌డౌన్ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని పేర్కొన్నారు.
మరోవైపు ముంబై మహానగరం వైరస్ కోరల్లో విలవిలలాడుతోంది. ముంబైలో 510 తాజా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 9000 దాటిపోయింది. ఇక మహారాష్ట్రలో వ్యాప్తంగా 841 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది. (మహమ్మారి విజృంభణతో ముంబై విలవిల)
Comments
Please login to add a commentAdd a comment