
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అత్యంత సంపన్న పార్టీగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది. వీటిలో 14 పార్టీలు తమ ఆదాయం తగ్గిపోయిందని ప్రకటించగా 13 పార్టీలు రాబడి పెరిగిందని పేర్కొన్నాయి.
ఐదు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు తమ ఆదాయ పన్ను రిటన్స్‌ను సమర్పించలేదు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, కేరళ కాంగ్రెస్-మణి పార్టీలు ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేయలేదు. ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం, జేడీఎస్‌లు పేర్కొనగా, తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు డీఎంకే వెల్లడించింది. ఎస్‌పీ, ఏఐఏడీఎంకేలు వరుసగా రూ 64 కోట్లు, రూ 37 కోట్లు వెచ్చించాయి.
Comments
Please login to add a commentAdd a comment