సాక్షి, న్యూఢిల్లీ: ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్’(జీఈఎస్)లో పాల్గొనేందుకు 1,500 మంది ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దక్షిణాసి యాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందులో క్రీడారంగానికి చెందిన పుల్లెల గోపీచంద్, సానియా మీర్జా తమ కెరీర్ వివరాలను పంచుకుంటారు. ఈ సదస్సుకు అమెరికా సహ ఆతిథ్యం ఇస్తోంది. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో మూడో వంతు అమెరికా నుంచి, మూడోవంతు మన దేశం నుంచి ఉన్నారు. మరో మూడో వంతు ఇతర దేశాల నుంచి ఉన్నారు.
మొత్తం 1,500 మంది ప్రతినిధుల్లో దాదాపుగా 300 మంది పెట్టుబడిదారులు ఉంటారు. 35 దేశాలకు చెందిన విభిన్న రంగాల్లో ఖ్యాతి గాంచిన వారు, విభిన్న నేపథ్యాలున్నవారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సాంకేతిక రంగం, సృజనాత్మక రంగం, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు జాన్ చాంబర్స్, ప్రేమ్ వత్స, మార్కస్ వాలెన్‌బెర్గ్ తదితరులు విభిన్న అంశాలపై ప్రసంగిస్తారు. అంతరిక్ష యాత్రికు రాలు అనౌషే అన్సారీ తన అనుభవాలు పంచుకుంటారు. తిరస్కరణకు గురైన విమాన సహాయకురాలి నుంచి సొంత విమానయాన సంస్థను నెలకొల్పే స్థాయికి ఎదిగిన సిబొంగైల్ సాంబో తన జీవన యానాన్ని వివరించను న్నారు. ప్రముఖ ఎంఐటీ ప్రొఫెసర్లు కార్లో రాటి, డేనియల్ వుడ్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ధోరణులను పంచుకుంటారు. భారతదేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అనూ ఆచార్య, రాధికా అగర్వాల్ స్టార్టప్స్‌పై మాట్లాడుతారు. ఇన్వెస్టర్లుగా రాణిస్తున్న తెలుగు వ్యక్తి వాణి కోలా, శాంతిమోహన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో తమ అనుభవాలు పంచుకుంటారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్‌లో రెస్టారెంట్ చైన్‌ను అభివృద్ధి చేసిన తీరును వివరిస్తారు. ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు 24 ఏళ్ల రితేష్ అగర్వాల్, 3 ఇడియట్స్ సినిమాలోని ఫున్‌షుఖ్ వాంగ్డు క్యారెక్టర్‌కు స్ఫూర్తి అయిన ప్రముఖ ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్, పద్మశ్రీ గ్రహీత పీయూష్ పాండే ఈ వేదికపై ప్రసంగిస్తారు.
52.5 శాతం మంది మహిళలే..
వాషింగ్టన్: ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా బృందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ లాంటి సుమారు 10 దేశాల నుంచి కేవలం మహిళలే హాజరు కానున్నారని పేర్కొంది. మొత్తంగా చూస్తే సదస్సుకు హాజరవుతున్న వారిలో మహిళా పారిశ్రామికవేత్తల శాతం 52.5 శాతమని తెలిపింది. జీఈఎస్ సదస్సుకు వస్తున్న వారిలో మహిళలు మెజారిటీగా ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment