దిస్పూర్ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చట్టంపై రగులుతున్న నిరసనలపై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. హింసాత్మక చర్యలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
‘హింసకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. అసోం అస్సామీ ప్రజలతోనే ఉంది. ఇందుకోసం అవసరమైతే ఏ చట్టాన్ని అయినా తీసుకువస్తాం. అసోం ప్రజలు చేసుకున్న 1985 ఒప్పందంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ఒప్పందాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా హామీయిచ్చారు’ అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. భారత ముస్లింలు, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ హక్కులకు ఎలాంటి భంగం కలగదని ఆయన హామీ ఇచ్చారు.
కాగా అసోంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించామని పోలీసులు తెలిపారు. పౌరులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నామని అసోం పోలీసులు ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రంలో డిసెంబర్ 11న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment