
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో భారత్‌లోకి రూ. 80 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. 1.5 కోట్ల పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. దేశీయంగా మారిటైమ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ మారిటైమ్ సూపర్‌పవర్‌గా భారత్ ఎదగనుందని పేర్కొన్నారు.
కేంద్రం తలపెట్టిన సాగరమాల ప్రోగ్రాంతో 2035 నాటికి రూ. 5.8 లక్షల కోట్ల విలువ చేసే 840 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ. 1.41 లక్షల కోట్ల విలువ చేసే 272 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న వాధ్వాన్ పోర్టు అంతర్జాతీయంగా టాప్ 10 కంటైనర్ పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని సోనోవాల్ వివరించారు. దీనితో 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు.