
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో దేశం అప్రతిష్ట పాలైందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విఫల ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతరిక్ష రంగం కోసం మరిన్ని నిధులు కేటాయించడం వృథా ప్రయాసే అన్నారు. వివిధ కార్యక్రమాల కోసం అదనపు నిధుల మంజూరు విషయమై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సౌగతా రాయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్)
కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిన చంద్రయాన్-2 గురించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇక సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. అయితే నాసా వ్యాఖ్యలను ఇస్రో చీఫ్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment