
తిరువనంతపురం : వరద బీభత్సంతో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రానికి, ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా ఆపన్న హస్తం అందించింది. ఆ రాష్ట్రంలో తాత్కాలికంగా అన్ని బ్యాంకింగ్ లావాదేవీల ఛార్జీలను, ఫీజులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వరద సహాయ చర్యల కోసం మంజూరు చేసే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులకు కూడా ఈ మాఫీ వర్తించనుంది. డూప్లికేట్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, ఈఎంఐ లావాదేవీలపై ఆలస్యపు పేమెంట్ ఫీజులను ఎస్‌బీఐ రద్దు చేసింది. రెమిటెన్స్‌లపై వచ్చే అన్ని ఛార్జీలను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి మరలించనున్నట్టు పేర్కొంది. దీనిలోనే ఇతర బ్యాంక్‌ల నుంచే వచ్చే ఎన్‌ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ రెమిటెన్స్‌లు ఉండనున్నాయి. ఏమైనా ఛార్జీలను విధిస్తే వాటిని రీఫండ్ చేయనున్నట్టు ప్రకటించింది.
సహాయ చర్యల్లో భాగంగా ఎవరైతే తమ వ్యక్తిగత డాక్యుమెంట్లను కోల్పోతారో, వారు కేవలం ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్రతోనే చిన్న అకౌంట్లను తెరిచేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏటీఎంలను, బ్రాంచ్‌లను వెంటనే తెరిచేలా చర్యలు చేపడతామని ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాక కేరళలో వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.2 కోట్లను అందిస్తోంది. తన 2.7 లక్షల ఉద్యోగులు కూడా తమ వంతు సహాయ సహకారం అందించేందుకు ఎస్‌బీఐ ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి, సీఎండీఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment