
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌సీఆర్‌బీ సమాచారం ప్రకారం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఓ బాలికపై లైంగిక దాడి జరుగుతోందని, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉండగా, యూపీ రెండో స్ధానంలో ఉందని, అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల కేసును విచారిస్తూ బిహార్ ప్రభుత్వం ఈ తరహా షెల్టర్ హోంలను ఎలా అనుమతిస్తోందని మండిపడింది.
2004 నుంచి వసతి గృహం నడుపుతున్న ఎన్‌జీఓకు బిహార్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని, అసలు అక్కడ ఏం జరుగుతున్నదే దానిపై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకపోవడాన్ని కోర్టు ఆక్షేపించింది. అక్కడి వ్యవహారాలపై విచారణ జరిపించాలనే ఆలోచన ఎందుకు కలగలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసులో నిందితులను శిక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని కోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
షెల్టర్ హోంలో తనిఖీలను మొక్కుబడిగా చేపట్టారని, చిత్తశుద్ధితో వ్యవహరించలేదని దుయ్యబట్టింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఆగస్ట్ 2న బిహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment