
సాక్షి,న్యూఢిల్లీ: న్యాయమూర్తుల పేరిట కొందరు ముడుపుల స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.న్యాయవ్యవస్థను అపవిత్రం చేసేందుకు ఎవరినీ అనుమతించమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. చట్టం నుంచి ఎంతటి పెద్దవారైనా తప్పించుకోలేరని, న్యాయం జరిగి తీరుతుందని పేర్కొంది.తీవ్రమైన ఆరోపణలు తలెత్తినప్పుడు కేసు ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరని జస్టిస్ ఏకే సిక్రి, అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. కేసుల సానుకూల పరిష్కారం కోసం సుప్రీం న్యాయమూర్తుల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన విషయం తెలిసిందే.
ఈ కేసును కూలంకషంగా విచారించాలని, సీబీఐ విచారణను కొనసాగించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్నినియమించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సిఉందని బెంచ్ పేర్కొంది. మరోవైపు ఈ కేసును తగిన బెంచ్‌కు బదలాయించిన అనంతరం మళ్లీ తమ ముందుకు దీన్ని లిస్ట్ చేసిన తీరుపై పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీం ప్రశ్నించింది.
‘మీరు నా సాయం కోరి ఉంటే దీనిపై తగిన నిర్ణయం తీసుకునేవాడ్ని...పిటిషనర్ తీరుపై తాము కలత చెందామని’ జస్టిస్ సిక్రీ ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్‌తో అన్నారు. అయితే తమ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం నుంచి ఇతర బెంచ్‌కు బదలాయించారని, ప్రదాన న్యాయమూర్తి ముందస్తు ఆదేశాలకు అనుగుణంగా ఇలా చేశామని కోర్టు రిజిస్ర్టీ తనకు సమాచారం ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment