bribe allegations
-
హోంమంత్రి అనిత పీఏ అవినీతి దందా
సాక్షి, అనకాపల్లి: ఏపీలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా కొనసాగుతోంది. మంత్రి అనిత అండతో పీఏ జగదీష్ అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో, జగదీష్ అంశం చర్చనీయాంశంగా మారింది.ఏపీ హోం మంత్రి అనిత పీఏ జగదీష్ అవినీతి దందా బయటపడింది. అనిత అండతో జగదీష్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ నేతలే ఫిర్యాదులు చేయడం గమనార్హం. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా జగదీష్ అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి.అలాగే, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి తేవడం. ఉద్యోగుల బదిలీల్లో లక్షల వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలనే తప్పుడు కేసుల్లో జగదీష్ ఇరికించినట్టు తెలుస్తోంది. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారని సమాచారం. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. -
అదానీపై కేసు: ‘ఎవరికి లంచాలు ఇచ్చారో ఛార్జ్‌షీట్‌లో లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: అదానీపై అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయ నిపుణుడు, భారత మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ విశ్లేషణ జరిపారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదని అన్నారాయన.. అదానీ వ్యవహారంలో అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్ పూర్తిగా తప్పుల తడక. చార్జ్‌షీట్‌లో ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ.. వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు.నేనేం అదానీ గ్రూప్ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేనొక లాయర్ని. అమెరికా కోర్టు నేరారోపణను నేను పరిశీలించా. అందులో ఐదు అభియోగాల్లో.. ఒకటి, ఐదో అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిల్లోనూ అదానీగానీ, ఆయన బంధువు సాగర్‌పై గానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో.. అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే.. కీలక ఆరోపణల్లోనూ అదానీ పేరు లేదు అని చెప్పారాయన.ఆరోపణలు చేసే సమయంలో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటన్నది కచ్చితంగా ఛార్జ్‌షీట్‌లో ఉండాలి. అదానీపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పేర్లు లేకుండా ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు మాత్రమే చేయడం.. విస్మయం కలిగించింది. ఇలాంటి ఛార్జ్‌షీట్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అదానీ న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని రోహత్గీ అన్నారు. -
మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చి చెప్పింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆమెను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బుధవారం సిఫార్సు చేసింది. మహువాపై వచ్చిన నగదు సంబంధిత ఆరోపణలపై ఎథిక్స్ ప్యానెల్ పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మొత్తం 500 పేజీలతో కూడిన నివేదికను ప్యానెల్ సిద్ధం చేసింది. ఆమె నివేదిక ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ సిఫారసు చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ప్యానెల్.. కేంద్రం ఆధ్వర్యంలో కాలపరిమితితో కూడిన చట్టపరమైన దర్యాప్తునకు సిఫార్సు చేసింది. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ విచారణ చేపట్టింది. నవంబర్ 2వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
లిక్కర్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్.. లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో తాజాగా కొత్త కోణం బయటకు వచ్చింది. లిక్కర్ కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఖత్రీతో పాటుగా అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్, ప్రవీణ్ కుమార్ వాట్స్‌పై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది. అయితే, సదరు అధికారి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రూ.5కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. CBI has registered a case against Pawan Khatri, Assistant Director ED, Deepak Sangwan employee of Air India, Vikramaditya CEO of Claridges Hotels & Resorts and others accused in connection with the ongoing delhi liquor scam case. — ANI (@ANI) August 28, 2023 ఇది కూడా చదవండి: భారత్‌కు రాలేనన్న పుతిన్.. అరెస్ట్ భయమే కారణమా? -
ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా: ఈటల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయన్న ఈటల రాజేందర్ కామెంట్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల.. శనివారం సాయంత్రం బయట మీడియాతో మాట్లాడారు. ‘‘నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. ఆత్మసాక్షిగానే చెప్పా. నేను ఎవరినీ కించపరిచే వ్యక్తిని.. గాయపరిచే వ్యక్తిని కాను. నేను వ్యక్తుల కోసం మాట్లాడలేదు.. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా’’ అని పేర్కొన్నారు ఈటల. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడ్తా. రేపు(ఆదివారం) మాట్లాడతా.. అందరికీ సమాధానం చెప్తా. ఓ పొలిటికల్ లీడర్ కు కావాల్సింది కాన్ఫిడెంట్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్?. ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు అని తెలిపారాయన. కేసీఆర్ వ్యతిరేకంగా రేవంత్ పోరాడడం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్ధ ఏంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా అని ఈటల తెలిపారు. ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా? అంటూ రేవంత్ సవాల్లో పాల్గొనకుండానే బదులిచ్చారు ఈటల. -
ఈటలకు రేవంత్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై స్పందిస్తూ.. రేవంత్ సవాల్ విసిరారు. రేపు(శనివారం, ఏప్రిల్ 22) సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వస్తా. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలి. ఈ విషయంలో ఈటల దిగజారి మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ మండిపడ్డారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దంటే.. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తా. నేను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తా. నా సవాల్ స్వీకరించి గుడికి వచ్చి ఈటల ప్రమాణం చేయాలి అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఆరు నెలలు అయితే రాష్ట్రమే గుంజుకుంటాం..కేసీఆర్ దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా?. విచక్షణ మరచిపోయి మాట్లాడితే ఎలా?. రేవంత్ రెడ్డి అంటే ఈటల ఏమనుకుంటున్నాడు?. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి కాకుండా ఇంకెవరు కొట్లాడారు. నాపైన ఈటల చేసిన ఆరోపణకు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నా’’ అని రేవంత్ పేర్కొన్నారు. నా పోరాటాన్ని ఈటల కించపరిచారు. రేపు సాయంత్రం 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు. అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారాయన. అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పెద్దవాళ్ల కంటే ఎస్సీ, ఎస్టీ , బీసీ నాయకులే మునుగోడు ఎన్నికలకు సహాయం చేసారు. ఆ టైంలో పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ సహాయం చేయాలని అడిగా. కానీ, ఉన్నత వర్గాల వారు ఎవరు సహాయం చేయలేదు అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: నోరు జారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే -
కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్‌తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్‌ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన షాహీన్ (పేరుమార్చాం) షాదీ ముబారక్ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు. అందిన చోటల్లా వసూళ్లే.. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాక నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం. స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కచోటే 86లక్షలుమింగేశారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంగా విజిలెన్స్ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ విషయంలో.. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్ అసిస్టెంట్ ఏకంగా రూ.86,09,976 దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు. ఆన్లైన్.. పేరుకే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. కానీ చాలాచోట్ల మ్యాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్‌గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్‌గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే తీసుకోవాలనే గానీ, బలవంతంగా వసూలు చేయడం తగదంటూ అధికారులకు ఓ ఎమ్మెల్యే చెప్పడం వివాదాస్పదంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ఎమ్మెల్యే రాంబాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దామోహ్ జిల్లా పథారియా నియోజకవర్గం సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాయి పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధి పొందేందుకు తా చదవండి: నిజం కోసమే నా పోరాటం: నవజోత్ సింగ్ సిద్ధూ దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని వారికి సూచించారు. ప్రజలు రూ.500, రూ.1,000.. ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ, వారివద్ద ఉన్నదంతా లాగేసుకోవాలని చూడటం తగదని హితవు పలికారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపించి, లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్ సమర్థించుకున్నారు. సతావువా గ్రామ నిరుపేదలు ఎంత కష్టపడినా నెలకు రూ.6వేలు సంపాదించడం కష్టమని తెలిపారు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతంగా రాబట్టాలని చూడటం తగదని తాను చెప్పానన్నారు. చదవండి: పళ్లు ఊడిపోయాయని ఏకంగా ప్రధాని మోదీకే లెటర్, వైరల్ म.प्र: दमोह जिले के पथरिया की महिला विधायक रामबाई का यह वीडियो इस समय वायरल हो रहा है। रामबाई वही हैं जिनके पति पर हत्या का आरोप है। समय-समय पर उनके अपने क्षेत्र के लोगों की समस्या के निराकरण के दौरान उऩके संवादों के वीडियो वायरल होते रहते हैं #ViralVideo pic.twitter.com/TAcb6x65FT — Hindustan (@Live_Hindustan) September 28, 2021 -
యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు
సాక్షి, బెంగుళూరు : ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పతో పాటు మరో ఐదుగురు బీజేపీ నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి కొనుగోలు చేసేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. బల నిరూపణ సమయంలో ఈ తతంగం నడిచిందని వివరించింది. బీజేపీ నాయకులు బేరసారాలు సాగించిన ఆడియో టేపులను ఇందుకు ఆధారాలుగా సమర్పించింది. కాగా, బల నిరూపణకు ముందు బీజేపీ నేతలకు సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఆ టేపులు నకిలీవని, తమ గొంతులను మిమిక్రీ చేసి రికార్డు చేశారని ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. యడ్యూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర, బీజేపీ కర్ణాటక ఇంచార్జ్ మురళీధర్ రావు, గాలి జనార్ధన్ రెడ్డి, బీ శ్రీరాములు, బీజే పుట్టస్వాములు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది. -
‘ఆ కేసు చాలా సీరియస్’
సాక్షి,న్యూఢిల్లీ: న్యాయమూర్తుల పేరిట కొందరు ముడుపుల స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.న్యాయవ్యవస్థను అపవిత్రం చేసేందుకు ఎవరినీ అనుమతించమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. చట్టం నుంచి ఎంతటి పెద్దవారైనా తప్పించుకోలేరని, న్యాయం జరిగి తీరుతుందని పేర్కొంది.తీవ్రమైన ఆరోపణలు తలెత్తినప్పుడు కేసు ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరని జస్టిస్ ఏకే సిక్రి, అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. కేసుల సానుకూల పరిష్కారం కోసం సుప్రీం న్యాయమూర్తుల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ కేసును కూలంకషంగా విచారించాలని, సీబీఐ విచారణను కొనసాగించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్నినియమించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సిఉందని బెంచ్ పేర్కొంది. మరోవైపు ఈ కేసును తగిన బెంచ్‌కు బదలాయించిన అనంతరం మళ్లీ తమ ముందుకు దీన్ని లిస్ట్ చేసిన తీరుపై పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీం ప్రశ్నించింది. ‘మీరు నా సాయం కోరి ఉంటే దీనిపై తగిన నిర్ణయం తీసుకునేవాడ్ని...పిటిషనర్ తీరుపై తాము కలత చెందామని’ జస్టిస్ సిక్రీ ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్‌తో అన్నారు. అయితే తమ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం నుంచి ఇతర బెంచ్‌కు బదలాయించారని, ప్రదాన న్యాయమూర్తి ముందస్తు ఆదేశాలకు అనుగుణంగా ఇలా చేశామని కోర్టు రిజిస్ర్టీ తనకు సమాచారం ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. -
ఐఏఎస్ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు
- లంచమివ్వనందుకే కేసు పెట్టారు - హత్య కేసులో ఐఏఎస్ డీవీ రావు ఆరోపణలు - జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పూర్తిగా అవినీతిమయం - నెలకు రూ.75 లక్షలు మామూళ్లుగా అందుతాయి - ఉన్నతాధికారులకూ వాటాలు వెళ్తాయని ఆరోపణ - ఇవన్నీ నిరాధార ఆరోపణలు: వెస్ట్‌జోన్ డీసీపీ సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ బుక్యా నాగరాజు హత్య కేసులో పోలీసులు లంచం డిమాండ్ చేశారని, ఇవ్వనందుకే తనను కేసులో ఇరికించారని ఐఏఎస్ అధికారి దారావత్ వెంకటేశ్వర రావు (డీవీ రావు) ఆరోపించారు. అసలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ అవినీతిమయమని తనకు తెలిసిందని, నెలకు రూ.75 లక్షల దాకా మామూళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీవీ రావు మాట్లాడిన వీడియో దశ్యాలు బుధవా రం మీడియాకు అందాయి. అయితే ఈ ఆరోప ణలు నిరాధారమని, డీవీ రావుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్జో న్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కావాలనే ఇరికించారు! మీడియాకు అందిన వీడియోలో డీవీ రావు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని పోలీసు స్టేషన్లో నా కుమారుడిని అడిగాను. మద్యం తాగుదామని నాగరాజు తీసుకువెళ్లడం నుంచి చివరి వరకు అన్నీ చెప్పాడు. మద్యం మత్తులో మిస్ బిహేవ్ (తప్పుడు ప్రవర్తన), మిస్ అండర్స్టాండింగ్ (తప్పుగా అర్థం చేసు కోవడం) వల్ల ఈ హత్య జరిగింది. నేనే నా కుమారుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించా. కానీ అధికారులు నన్ను డబ్బు డిమాండ్ చేశారు. ఇవ్వలేదని నన్ను కేసులో ఇరికించారు. సుకత్ ఒక్కడే అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడు. కానీ నేను ఆ అపార్ట్మెంట్ వద్ద ఉన్నానని పోలీసులు అంటున్నారు. ఏ తండ్రి అయినా కుమారుడిని శవం తీసుకురమ్మని పైకి పంపిస్తాడా..? డబ్బు ఇవ్వనందుకే పోలీసులు నాపైనా కేసు పెట్టారు. నన్ను మూడు రోజుల పాటు పోలీసుస్టేషన్లో నిర్బంధించి.. భోజనం, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి వస్తానన్నా వదల్లేదు. కానిస్టేబుల్, ఎస్సై, సీఐలు ఏకమై ఇలా ఓ ఐఏఎస్‌ను ఆపడానికి కారణం అవినీతి అధికారుల కుట్రే. దర్యాప్తు సంస్థలు దీనిపై దష్టి పెట్టాలి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కొందరు మంచి వాళ్లూ ఉన్నారు. అక్కడికి ఎవరైనా ఏదైనా కేసులో వస్తే నాశనం అవుతారని వారు నాతో చెప్పారు. ఆ పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.75 లక్షలు మామూళ్లు వస్తాయని.. పైఅధికారులకు కూడా ఇస్తామనీ చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో 40 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. కానీ మూడేళ్లుగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బదిలీ కాలేదు. కేసుల్లో వచ్చిన వారి నుంచి భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు ఇస్తారని, అందుకే బదిలీ చేయలేదని కొందరు చెప్పారు..’’అని డీవీ రావు వీడియోలో ఆరోపించారు. వ్యక్తిగత పరిచయంతోనే ఏసీపీ మాట్లాడి ఉండొచ్చు: డీసీపీ డీవీ రావువి నిరాధార ఆరోపణలని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పంజాగుట్ట ఏసీపీ వ్యక్తిగత పరిచయంతోనే డీవీ రావుతో మాట్లాడి ఉండొచ్చని, దీనిపై ఆరా తీస్తామని చెప్పారు. పోలీసు కస్టడీలో ఉన్న డీవీ రావుకు సంబంధించి బయటకు వచ్చిన ఈ వీడియోలను ఆయన భార్య రికార్డు చేసినట్లు తెలుస్తోందని, దీనిపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. డీవీ రావును ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు. దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే డీవీ రావును అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందని.. ఆయన పాత్రపై ఆధారాలు లభించాకే అరెస్టు చేశామని వివరించారు. కానీ ఆయన తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాగా.. ఈ కేసులో నిందితులు వెంకట సుకత్ (19), డీవీ రావులను పోలీసులు బుధవారం నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాలు రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఐఏఎస్ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు