ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు | Cops Demanded Rs.2 crore to evade my son from case: IAS Venkateswarrao | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు

Published Thu, Mar 23 2017 5:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నిందితులు డీవీ రావు, సుకృత్‌. - Sakshi

నిందితులు డీవీ రావు, సుకృత్‌.

- లంచమివ్వనందుకే కేసు పెట్టారు
- హత్య కేసులో ఐఏఎస్‌ డీవీ రావు ఆరోపణలు
- జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పూర్తిగా అవినీతిమయం
- నెలకు రూ.75 లక్షలు మామూళ్లుగా అందుతాయి
- ఉన్నతాధికారులకూ వాటాలు వెళ్తాయని ఆరోపణ
- ఇవన్నీ నిరాధార ఆరోపణలు: వెస్ట్‌జోన్‌ డీసీపీ


సాక్షి, హైదరాబాద్‌:
డ్రైవర్‌ బుక్యా నాగరాజు హత్య కేసులో పోలీసులు లంచం డిమాండ్‌ చేశారని, ఇవ్వనందుకే తనను కేసులో ఇరికించారని ఐఏఎస్‌ అధికారి దారావత్‌ వెంకటేశ్వర రావు (డీవీ రావు) ఆరోపించారు. అసలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ అవినీతిమయమని తనకు తెలిసిందని, నెలకు రూ.75 లక్షల దాకా మామూళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీవీ రావు మాట్లాడిన వీడియో దశ్యాలు బుధవా రం మీడియాకు అందాయి. అయితే ఈ ఆరోప ణలు నిరాధారమని, డీవీ రావుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ వెస్ట్‌జో న్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

కావాలనే ఇరికించారు!
మీడియాకు అందిన వీడియోలో డీవీ రావు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని పోలీసు స్టేషన్‌లో నా కుమారుడిని అడిగాను. మద్యం తాగుదామని నాగరాజు తీసుకువెళ్లడం నుంచి చివరి వరకు అన్నీ చెప్పాడు. మద్యం మత్తులో మిస్‌ బిహేవ్‌ (తప్పుడు ప్రవర్తన), మిస్‌ అండర్‌స్టాండింగ్‌ (తప్పుగా అర్థం చేసు కోవడం) వల్ల ఈ హత్య జరిగింది. నేనే నా కుమారుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించా. కానీ అధికారులు నన్ను డబ్బు డిమాండ్‌ చేశారు. ఇవ్వలేదని నన్ను కేసులో ఇరికించారు. సుకత్‌ ఒక్కడే అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లాడు. కానీ నేను ఆ అపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్నానని పోలీసులు అంటున్నారు.

ఏ తండ్రి అయినా కుమారుడిని శవం తీసుకురమ్మని పైకి పంపిస్తాడా..? డబ్బు ఇవ్వనందుకే పోలీసులు నాపైనా కేసు పెట్టారు. నన్ను మూడు రోజుల పాటు పోలీసుస్టేషన్‌లో నిర్బంధించి.. భోజనం, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి వస్తానన్నా వదల్లేదు. కానిస్టేబుల్, ఎస్సై, సీఐలు ఏకమై ఇలా ఓ ఐఏఎస్‌ను ఆపడానికి కారణం అవినీతి అధికారుల కుట్రే. దర్యాప్తు సంస్థలు దీనిపై దష్టి పెట్టాలి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కొందరు మంచి వాళ్లూ ఉన్నారు. అక్కడికి ఎవరైనా ఏదైనా కేసులో వస్తే నాశనం అవుతారని వారు నాతో చెప్పారు. ఆ పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.75 లక్షలు మామూళ్లు వస్తాయని.. పైఅధికారులకు కూడా ఇస్తామనీ చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో 40 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. కానీ మూడేళ్లుగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ కాలేదు. కేసుల్లో వచ్చిన వారి నుంచి భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు ఇస్తారని, అందుకే బదిలీ చేయలేదని కొందరు చెప్పారు..’’అని డీవీ రావు వీడియోలో ఆరోపించారు.

వ్యక్తిగత పరిచయంతోనే ఏసీపీ మాట్లాడి ఉండొచ్చు: డీసీపీ
డీవీ రావువి నిరాధార ఆరోపణలని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పంజాగుట్ట ఏసీపీ వ్యక్తిగత పరిచయంతోనే డీవీ రావుతో మాట్లాడి ఉండొచ్చని, దీనిపై ఆరా తీస్తామని చెప్పారు. పోలీసు కస్టడీలో ఉన్న డీవీ రావుకు సంబంధించి బయటకు వచ్చిన ఈ వీడియోలను ఆయన భార్య రికార్డు చేసినట్లు తెలుస్తోందని, దీనిపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. డీవీ రావును ఎవరూ డబ్బు డిమాండ్‌ చేయలేదన్నారు.

దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే డీవీ రావును అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందని.. ఆయన పాత్రపై ఆధారాలు లభించాకే అరెస్టు చేశామని వివరించారు. కానీ ఆయన తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాగా.. ఈ కేసులో నిందితులు వెంకట సుకత్‌ (19), డీవీ రావులను పోలీసులు బుధవారం నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాలు రిమాండ్‌ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement