''స్కూళ్ళు.. డబ్బు ఒడికే యంత్రాలు'' | Schools now money spinning rackets: Bombay HC | Sakshi
Sakshi News home page

''స్కూళ్ళు.. డబ్బు ఒడికే యంత్రాలు''

Published Wed, Jul 6 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

Schools now money spinning rackets: Bombay HC

ముంబైః పాఠశాలలు పిల్లలనుంచీ డబ్బును ఒడికే యంత్రాలుగా మారిపోతున్నాయంటూ ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ విద్యార్థిని అకారణంగా స్కూల్ నుంచి బయటకు పంపిన కారణంగా  దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు  కోర్టు నోటీసులు జారీ చేసింది. అడిగిన ఫీజు కట్టినతర్వాత కూడా... పుస్తకాలు, యూనిఫాం అంటూ మరో 50 వేలు కట్టాలని స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసినట్లు విద్యార్థి తండ్రి కోర్టుకు ఓ లేఖద్వారా విన్నవించాడు. దీంతో విచారించిన ముంబై హైకోర్టు సదరు స్కూలుకు నోటీసులు పంపించింది.

ఇటీవల స్కూలు యాజమాన్యాలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, డబ్బు ఒడికే యంత్రాలుగా మారుతున్నాయని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫీజు మొత్తం కట్టిన తర్వాత కూడా.. విద్యార్థినుంచి మరో 50 వేల రూపాయలు డిమాండ్ చేయడంతోపాటు, నిర్దాక్షిణ్యంగా విద్యార్థిని స్కూలునుంచి బయటకు పంపించిన విషయంలో దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్  హెచ్ వి బి గ్లోబల్ అకాడమీ స్కూల్ కు నోటీసులు జారీ చేసింది. స్కూల్లో చదువుతున్న 12 ఏళ్ళ  విద్యార్థి కి జరిగిన అన్యాయంపై బాలుడి తండ్రి రాసిన లేఖను జస్టిస్ వీఎం కనాడే, ఎమ్ ఎస్ సోనాక్ డివిజన్ బెంచ్ విచారించింది.

ఏడవ తరగతిలో చేర్పించేందుకుగానూ పాఠశాల యాజమాన్యం ముందుగా కోరినట్లుగానే 1,09,500 రూపాయలను కట్టామని, అందుకు యాజమాన్యం రసీదు కూడ ఇచ్చిందని, అనంతరం యూనిఫాంలు, స్టేషనరీ పేరుతో 50 వేల రూపాయలు అదనంగా కట్టాలంటూ డిమాండ్ చేయడంతో తాము వ్యతిరేకించినందుకు గాను తమ కుమారుడ్ని పాఠశాలనుంచి బలవంతంగా టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) ఇచ్చి బయటకు పంపించేశారంటూ విద్యార్థి తండ్రి సంతోష్ మెహతా కోర్టుకు ఇచ్చిన లేఖలో వివరించాడు. అంతేకాక తమ కుటుంబాన్ని కూడా స్కూలు సిబ్బంది వేధింపులకు గురి చేసినట్లు మెహతా లేఖలో పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ఫిబ్రవరి నెల్లోనే విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కు, ఛైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశానని, అప్పట్లో విద్యార్థిని స్కూల్లోకి అనుమతించమంటూ విద్యాశాఖ డైరెక్టర్ స్కూలు యాజమాన్యానికి సూచించారని చెప్పారు. అనంతరం తమ కుమారుడు స్కూలుకు వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని, దాంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు మెహతా తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా సదరు స్కూలుకు నోటీసులు పంపించి, జూలై 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement