పార్లమెంటుకు 'రహస్య భేటీ' సెగ!
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) మధ్య బ్యాంకాక్ లో జరిగిన రహస్య సమావేశం సోమవారం పార్లమెంటును కుదిపేసే అవకాశం కనిపిస్తున్నది. గత కొన్నాళ్లుగా ఉప్పు-నిప్పులా ఉన్న దాయాదుల దౌత్య సంబంధాల్లో నాటకీయ మలుపులకు కారణమైన ఈ భేటీ పట్ల ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ రహస్య సమావేశం మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది భారీ మోసమే. ఈ మోసంతో ప్రభుత్వ తీరు బట్టబయలైంది' అని కాంగ్రెస్ నేత మనీష్ తివారి మండిపడ్డారు. 'ఎందుకంతా రహస్యం? చర్చలకు సంబంధించి చాలా అవకతవకగా వ్యవహరించారు' అని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్ రాయ్ విమర్శించారు.
రెండువారాల కిందట పారిస్ లో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బ్యాకాంక్ లో ఇరుదేశాల ఎన్ఎస్ఏల భేటీకి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదం, శాంతిభద్రతలు, జమ్ముకశ్మీర్ వంటి అనేక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది పాక్ లో జరుగబోయే సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యేందుకు వీలుగా ఈ భేటీ ఏర్పాటుచేశారని, ఈ సమావేశానికి ప్రధాని మోదీయే చొరవ తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.