ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి
సాక్షి, న్యూఢిల్లీ : మున్నా భజరంగీగా పేరుబడ్డ కరుడుగట్టిన నేరస్థుడు ప్రేమ్ ప్రకాష్ సింగ్ భార్య సీమా సింగ్ జూన్ 29వ తేదీన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తన భర్తను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జైలులో ఉన్నప్పటికీ తన భర్తకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. తన భర్త ప్రాణాలను ఎలాగైనా రక్షించండంటూ ఆమె విలేకరుల సమావేశం వేదిక నుంచి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జూలై 9వ తేదీన జైలులో మున్నా భజరంగీని మరో నేరస్థుల ముఠా సభ్యులు కాల్చి చంపారు. జైలర్‌ను సస్పెండ్ చేసి ముఖ్యమంత్రి యోగి జుడీషియల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు విధుల్లో ఎలాంటి లోపం లేదని, తాము జైల్లో మున్నా భజరంగీకి అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ నివేదిక కూడా ఇచ్చారు. రాష్ట్రంలో నేరాలను సమూలంగా నిర్మూలిస్తానని అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి శపథం చేశారు. 2017, నవంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. నేరస్థులు ఇక జైలుకైనా వెళతారు లేదంటే ఎన్‌కౌంటర్‌లోనైనా చస్తారని ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల కాలంలోనే రాష్ట్రంలో మున్నెన్నడు లేని విధంగా 921 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిల్లో 33 మంది మరణించారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నోటీసు కూడా అందుకుంది. 2017, ఏప్రిల్ నెల నుంచి 2018, ఫిబ్రవరి నెలల మధ్య పది నెలల కాలంలోనే రాష్ట్ర కారాగారాల్లో 365 మంది మరణించారు.
ఇన్ని ఎన్‌కౌంటర్లు, ఇన్ని కారాగార మరణాలు సంభవించినప్పటికీ రాష్ట్రంలో నేరాలు తగ్గిన సూచనలు మాత్రం లేవు. పైగా కొన్ని రకాల నేరాలు మునుపటి కన్నా పెరిగాయి. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల అరాచక పరిస్థితులు రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. మున్నా భజరంగీ ప్రాణాలకు ముప్పుందంటూ ఆయన భార్య బహిరంగంగా హెచ్చరిక చేశాక కూడా ఆయన్ని హత్య చేశారంటే ఓ నేరస్థుడు హతమయ్యాడు అనేకంటే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఎక్కువ కారణమని ప్రజలు నిందిస్తారు. ఇప్పటి వరకు ఏ నేరాలతోని ఎలాంటి సంబంధంలేని సీమా సింగ్ తన భర్త ప్రాణాలకు ప్రతీకారంగాగానీ, భర్త స్థానాన్ని భర్తీ చేసేందుకుగానీ నేరస్థుల ముఠాలో చేరితే ఆ పాపం ఎవరిదని? సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment