తెలంగాణ నోట్ పై కేంద్రమంత్రి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఢిల్లీ: తెలంగాణ నోట్ పై కేంద్రమంత్రి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ మింగుడుపడని అంశంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ విడుదలకు ముందు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావుల మాత్రమే పాల్గొన్నారు. మిగతా సీమాంధ్ర మంత్రులు సమావేశానికి దూరంగా ఉండి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, చిరంజీవిలు రాజీనామా చేసి కాంగ్రెస్ పై నిరసన వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమంలో పయనిస్తుండటంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో అత్యధికం శాతం మంది రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. ఒకప్రక్క ప్రజలు, మరోప్రక్క ఏపీఎన్జీవోల నుంచి అధిక స్థాయిలో ఒత్తిడి ఉండటంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయలేనపుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్గా తెలంగాణ నోట్పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.