
అగ్రికల్చర్ బెల్ట్‌గా సీమాంధ్ర
మురుగప్ప గ్రూప్ చైర్మన్ ఎ.వేలాయన్
చెన్నై: సీమాంధ్రలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ. వేలాయన్ తెలిపారు. వ్యవసాయానికి అనువైన వాతావరణం, భూమి పరిస్థితుల కారణంగా సీమాంధ్ర ప్రధాన అగ్రికల్చర్ బెల్ట్‌గా ఎదగగలదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించనుండటంతో .. వరి, మిరప, పత్తి, పప్పు ధాన్యాలు కీలకమైన పంటలుగా ఉండగలవని వేలాయన్ వివరించారు.
సరైన సాగు నీటి సదుపాయం కల్పించగలిగితే సీమాంధ్ర ప్రధాన వ్యవసాయ రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. విద్యుత్ కొరతే పెద్ద సమస్యని ఆయన చెప్పారు. అయితే, బీజేపీతో భాగస్వామ్యం కారణంగా సీమాంధ్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి తగిన తోడ్పాటు లభించే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు చిన్న బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వేలాయన్ చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కాకినాడ, విశాఖపట్నం దాకా తమ కార్యకలాపాలు ఉన్నాయని వివరించారు.