అక్కడ సెల్ఫీ తీసుకుంటే అంతే...
అహ్మదాబాద్ః రైల్వే ట్రాక్ ల పైనా, నడిచే ట్రైన్ల ముందు సెల్ఫీలు తీసుకునే పిచ్చికి.. రైల్వే శాఖ అడ్డుకట్ట వేసింది. విచక్షణను కోల్పోయి, ప్రాణాలతో చెలగాటమాడే సెల్ఫీల క్రేజ్ ను ఒదిలించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఒళ్ళూ పై తెలీకుండా సెల్ఫీలు తీసుకునే వారిపై రైల్వే యాక్ట్ 1989 లోని మూడు సెక్షన్లను అమలు చేసేందుకు సిద్ధమైంది.
సెల్ఫీలు తీసుకునేవారిపై అహ్మదాబాద్ రైల్వే అధికారులు కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటే ఐదేళ్ళ జైలు శిక్ష విధించేలా అహ్మదాబాద్ డివిజన్ రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకొంది. ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముంబై తర్వాత ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటూ పట్టుబడితే రైల్వే యాక్ట్ 1989 ప్రకారం శిక్షను అమలు చేసే అవకాశం ఉందని రైల్వే పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
ప్రయాణీకులు తీసుకునే సెల్ఫీల్లో కేవలం రైల్వే ట్రాక్ లు కనిపిస్తే 147, ట్రాక్ తో పాటు ట్రైన్ కూడా ఉంటే 145, 147 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే కదులుతున్న రైల్లోనూ, కదులుతున్నరైలు, గూడ్స్ బ్యాగ్రౌండ్ లో ఉండేలా సెల్ఫీ తీసుకున్నా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) చట్టాల ప్రకారం నేరంగానే పరిగణిస్తారు. కదులుతున్న ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకుంటుండగా పట్టుబడ్డ వారిపై 153 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారని, వారికి సుమారు 5 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవల సెల్ఫీలవల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతుండటంతో రైల్వే అధికారులు ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో.. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ఫీల విషయంలో జనం జర జాగ్రత్తగా ఉండాల్సిందే.