కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్‌పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు.
వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్‌పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు.
రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు.
చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment