sampark kranti express
-
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
రైలులో మద్యం మత్తులో...
ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్‌లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఏసీ కంపార్ట్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని ఆరీ్పఎఫ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగా పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్లు దాటినా కొత్త రైళ్లు పట్టాలెక్కడంలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఇప్పటికీ ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది, అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి న్యూఢిల్లీకి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అంబాటులో ఉంది. దీంతో ప్రయాణికులు ఈ ఒక్క రైల్లో బెర్తు కోసం నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం చర్విత చర్వణంగా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కొత్త రైళ్లు మాత్రం రావడం లేదు. తాజాగా కేంద్రం మరో మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా చారిత్రక హైదరాబాద్ నుంచి తెలంగాణ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏదీ సంపర్క్ క్రాంతి... ► ఏపీ, తమిళనాడు, కర్ణాకటక, కేరళ తదితర అన్ని రాష్ట్రాల నుంచి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12708/12707) తిరుపతి నుంచి నిజాముద్దీన్ స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తోంది. ఇది కాచిగూడ మీదుగా అందుబాటులో ఉన్నప్పటికీ బెర్తులు లభించడం కష్టమే. ► మరోవైపు అన్ని రాష్ట్రాలకు చెందిన రాజధానులు లేదా పుణ్యక్షేత్రాల నుంచి సంపర్క్‌క్రాంతి రైళ్లు నడిపినప్పుడు తెలంగాణ నుంచి కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ► ప్రస్తుతం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాంపల్లి నుంచి కాజీపేట్, బల్లార్ష మీదుగా నడుస్తోంది. తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షల మీదుగా డెహ్రాడూన్ మార్గంలో నడిపితే ఇప్పటి వరకు న్యూఢిల్లీకి నేరుగా రైలు సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) కొత్త రైళ్లేవీ? ► మరోవైపు హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంద వందేభారత్ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ– వారణాసి, న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి ఆలయానికి మాత్రమే ఈ రైళ్లు గతేడాది నుంచి నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ను సికింద్రాబాద్ నుంచి న్యూఢిలీకి నడపాలనే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ► మరోవైపు హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా మరో వందేభారత్ రైలును ముంబై వరకు నడిపాలనే ప్రతిపాదన సైతం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ► మొత్తం 18 బోగీలు ఉండే ఈ ట్రైన్లో జీపీఎస్ అధునాతన సదుపాయాలు ఉంటాయి. ► సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రెండేళ్ల క్రితం నిలిపివేశారు. ఎంతో డిమాండ్ ఉన్న ఈ ట్రైన్ నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పుణే– సికింద్రాబాద్ మార్గంలో లైన్ల సామర్థ్యాన్ని పెంచి సత్వరమే శతాబ్ది రైలును పునరుద్ధరించాల్సి అవసరం ఉంది. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఏడేళ్లలో కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. పైగా ఉన్నవాటిని రద్దు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. – ఫణి, సాఫ్ట్వేర్ వందేభారత్ నడపాలి దక్షిణాదిలో ఇప్పటి వరకు వందే భారత్ రైలును ప్రవేశపెట్టలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి లేదా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలకు వందేభారత్‌ను నడపాలి. దీనివల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. – సునీల్, వికారాబాద్ -
నేటి నుంచే రైల్వే బుకింగ్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్ బుకింగ్‌లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే.. హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్–హౌరా: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు.. విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్ హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్‌ప్రెస్ ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్ దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. -
ఆ 8 మందికి కరోనా పాజిటివ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హైదరాబాద్: ఇండోనేసియా నుంచి కరీంనగర్ వచ్చిన 10 మంది బృందం ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు. ఢిల్లీ నుంచి ప్రయాణించిన 12708 నంబర్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎస్ 9 బోగీలో వారు ప్రయాణించినట్లు రైల్వే శాఖ అధికారులు గుర్తించారు. టికెట్లు రిజర్వ్ చేసుకునే సమయంలో అందించిన ఫోన్ నంబర్లను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశారు. ఆ వివరాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత రైలు తిరుపతి వరకు వెళ్లింది. అంటే ఆ బోగీలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. వారి రాకతో కలకలం.. ఇండొనేషియా నుంచి 10 మంది విమానంలో తొలుత ఢిల్లీ వచ్చారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి ఈనెల 13న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈనెల 14న రామగుండంలో దిగారు. అక్కడి నుంచి కరీంనగర్ వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రార్థనా మందిరంలో బసచేశారు. 15న ఉదయం పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలు ఇవ్వాలని పోలీసులు అడిగారు. దీంతో వైద్యపరీక్షల కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గైడ్‌తో పాటు ఇద్దరు స్థానికులతో కలసి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. విదేశీయులు కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని గాంధీకి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా తొలుత ఒకరికి పాజిటివ్ అని తేలగా, బుధవారం మరో ఏడుగురికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరందరికీ గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిని పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్‌ను నియమించగా, అతడిలో కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎంతమంది వచ్చారు.. ఇండొనేసియా బృందం ఢిల్లీ నుంచి రైలు మార్గంలో రామగుండం, అక్కడి నుంచి కరీంనగర్ చేరుకున్నారు. వీరితో పాటు మరో 20 మంది కూడా భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో మరో 10 మంది రామగుండం నుంచి జగిత్యాలకు వెళ్లినట్లు అనధికారిక సమాచారం. వీరు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కాగా, ఇంకో పది మంది ఎక్కడున్నారనే విషయంపై కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ తిరిగారు..? కరీంనగర్‌కు వచ్చిన ఇండొనేషియాకు చెందిన 10 మంది ఎక్కడ బస చేశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే అంశాలపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తోంది. కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రాంతంలో బసచేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న దుకాణాలను మూయించారు. వారు ఎవరెవరిని కలిశారనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. కరీంనగర్‌లోని పలు ప్రార్థనా మందిరాలతో పాటు రేకుర్తికి కూడా వెళ్లినట్లు సమాచారం. పలు చోట్ల కరచాలనంతో పాటు ఆలింగనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలను వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. ఇండొనేషియన్లు బస చేసిన ప్రాంతాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరికీ పరీక్షలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఆ బ్లడ్ గ్రూపు వాళ్లు తస్మాత్ జాగ్రత్త! ప్లీజ్ .. పెళ్లికి అనుమతించండి.. -
మత్తు మందు ఇచ్చి దోపిడీ చేశారు
కాజీపేట రూరల్: యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ప్రయాణికులను దుండగులు దోపిడీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జీఆర్పీ ఎస్ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన నితిన్‌జైన్, త్రిపురకు చెందిన రాహుల్, బిహార్‌కు చెందిన ప్రేమ్‌శంకర్, యూపీకి చెందిన బూరెఖాన్, కాన్పూర్‌కు చెందిన ఎండీ అబ్బాస్‌లు కర్ణాటకలో ప్రైవేట్ పనులు చేస్తున్నారు. ఆదివారం వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు యశ్వంత్‌పూర్ రైల్లో బయల్దేరారు. కోచ్‌లో ప్రయాణిస్తున్న కొందరు తోటి ప్రయాణికుల మాదిరిగా మాటలు కలిపి వారిని నమ్మించారు. ఈ క్రమంలో ధర్మవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత కూల్ డ్రింక్స్, బిస్కెట్లో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వగా ఆరుగురు వాటిని సేవించి స్పృహ తప్పారు. దీంతో వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు, వాచీ, గోల్డు రింగులను దోచుకుని తర్వాత స్టేషన్లో దిగి పారిపోయారు. జీఆర్పీ పోలీసులు అప్రమత్తమై కాజీపేటకు రైలు రాగానే బాధితులు ఆరుగురుని దింపి వరంగల్ ఎంజీఎం ఆస్ప త్రికి తరలించి చికిత్స చేయించారు. స్పృహలోకి వచ్చిన వారు విషయం వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రైలు సంపర్క్ క్రాంతిలో నిలువు దోపిడీ
సాక్షి, కాజీపేట : కర్ణాటకలోని యశ్వంతాపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి వారి సొత్తును దోచుకున్నారు. బెంగళూరులో పలు పనులు చేసుకుంటున్న యూపీ, ఢిల్లీ తదితర ప్రాంతాల వాసులు దినేశ్ బండారీ, సురేశ్, చాపస్, బాలశర్మ, సంజీవ్‌సింగ్, తివారీ స్వస్థలాలకు వెళ్లేం దుకు శనివారం రాత్రి బెంగళూరులో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కారు. మార్గమధ్యలో కొందరు దుండగులు అందులోకి ప్రవేశించి, ఈ ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు, సమోసాలు, కూల్‌డ్రింక్స్ ఇచ్చారు. దాంతో వారు నిద్రలోకి జారుకున్న తర్వాత వారివద్ద ఉన్న నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు కాచిగుడ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా, ఈ ఆరుగురు నిద్రలో నుంచి లేవకపోవడంతో ప్రయాణికులు స్టేషన్లో ఉన్న రైల్వే పోలీసులకు తెలిపారు. వారు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది కాజీపేట రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు కాజీపేటకు చేరుకోవడంతో పోలీసులు జనరల్ బోగీలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని కిందికి దింపారు. చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని పరిశీలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
‘ప్యారిస్’ ఫ్రమ్ మయన్మార్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వానికి పన్నుపోటు, పొగరాయుళ్ల ఆరోగ్యానికి చేటుగా మారుతున్న విదేశీ సిగరెట్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ స్మగ్లింగ్‌పై డేగకన్ను వేశారు. ఫలితంగా 13 రోజుల వ్యవధిలో రూ.7 కోట్ల విలువైన సిగరెట్లు పట్టుబడ్డాయి. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలో రూ.6.33 కోట్ల విలువైన సిగరెట్లు చిక్కిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా శుక్రవారం డీఆర్ఐ బృందం కాచిగూడ రైల్వేస్టేషన్లో దాడులు చేసింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు నిర్వహించి రూ.65.96 లక్షల విలువైన ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న స్మగ్లర్ తప్పించుకోగా... ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సిగరెట్లు మయన్మార్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 132 కార్టన్స్‌లో ఉన్న 13.19 లక్షల సిగరెట్లును డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గతంలో తిమ్మాపూర్ డిపోలో దొరికిన వాటిలో లండన్ తయారీ బెన్సన్ అండ్ హెడ్జెస్, యూఏఈకి చెందిన మోండ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు ఉన్న విషయం విదితమే. -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
మహబూబ్‌నగర్ : దేవరకద్ర రైల్వేస్టేషన్ దాటుతున్న క్రమంలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కొంత సేపు నిలిపేశారు. రైలు ఆపేసిన వెంటనే జనం కిందకు పరుగులు పెట్టారు. రైలును ఆపి పరిశీలించగా బ్రేకులు పట్టి వేయడంతో పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత రైలు మళ్లీ కదిలింది. రైలు తిరుపతి నుంచి కాచిగూడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
కాజీపేట : యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దుండగులు ఒక ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లేందుకు భార్యాభర్తలు మనోహర్‌రావు పద్మజ కలిసి వస్తున్నారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకముందే దుండగులు వారికి మత్తుమందు కలిపిన మామిడి రసం ఇవ్వడంతో వారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. వెంటనే ప్రయాణికురాలిపై ఉన్న చెవి కమ్మలు, కాళ్ల పట్టగొలుసులు, ఒక సెల్‌ఫోన్‌ను దోచుకొని పారిపోయారు. కాజీపేట జంక్షన్లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ లేదు. కాప్షన్ ఆర్డర్ కోసం కొద్ది సేపు ఆగింది. ఈ క్రమంలో మనోహర్‌రావుకు మెలుకువ వచ్చి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలోనే ఉన్న పద్మజను ఆస్పత్రికి తరలించారు.