సాక్షి, కాజీపేట : కర్ణాటకలోని యశ్వంతాపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి వారి సొత్తును దోచుకున్నారు. బెంగళూరులో పలు పనులు చేసుకుంటున్న యూపీ, ఢిల్లీ తదితర ప్రాంతాల వాసులు దినేశ్ బండారీ, సురేశ్, చాపస్, బాలశర్మ, సంజీవ్‌సింగ్, తివారీ స్వస్థలాలకు వెళ్లేం దుకు శనివారం రాత్రి బెంగళూరులో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కారు. మార్గమధ్యలో కొందరు దుండగులు అందులోకి ప్రవేశించి, ఈ ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు, సమోసాలు, కూల్‌డ్రింక్స్ ఇచ్చారు. దాంతో వారు నిద్రలోకి జారుకున్న తర్వాత వారివద్ద ఉన్న నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు.
రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు కాచిగుడ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా, ఈ ఆరుగురు నిద్రలో నుంచి లేవకపోవడంతో ప్రయాణికులు స్టేషన్‌లో ఉన్న రైల్వే పోలీసులకు తెలిపారు. వారు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది కాజీపేట రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు కాజీపేటకు చేరుకోవడంతో పోలీసులు జనరల్ బోగీలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని కిందికి దింపారు. చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని పరిశీలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment