యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దుండగులు ఒక ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
కాజీపేట : యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దుండగులు ఒక ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లేందుకు భార్యాభర్తలు మనోహర్‌రావు పద్మజ కలిసి వస్తున్నారు.
రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకముందే దుండగులు వారికి మత్తుమందు కలిపిన మామిడి రసం ఇవ్వడంతో వారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. వెంటనే ప్రయాణికురాలిపై ఉన్న చెవి కమ్మలు, కాళ్ల పట్టగొలుసులు, ఒక సెల్‌ఫోన్‌ను దోచుకొని పారిపోయారు. కాజీపేట జంక్షన్‌లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ లేదు. కాప్షన్ ఆర్డర్ కోసం కొద్ది సేపు ఆగింది. ఈ క్రమంలో మనోహర్‌రావుకు మెలుకువ వచ్చి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలోనే ఉన్న పద్మజను ఆస్పత్రికి తరలించారు.