
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు.
వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు.
పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment