
సీనియర్ న్యాయవాది పీపీ రావు కన్నుమూత
► గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
► బాబ్రీ మసీదు సహా పలు కేసుల్లో తనదైన ముద్ర వేసిన పీపీ రావు
► 1991లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక
► 2006లో పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసిన కేంద్రం
► స్వస్థలం ప్రకాశం జిల్లా మొగిలిచర్ల.. నేడు ఢిల్లీలో అంత్యక్రియలు
సాక్షి,న్యూఢిల్లీ/అమరావతి/కందుకూరు: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత పావని పరమేశ్వర రావు(84) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఇండియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లకు చెందిన పీపీ రావు ప్రాథమిక విద్యాభ్యాసం కనిగిరిలో సాగింది. నెల్లూరులోని వీఆర్ కళాశాలలో ఇంటర్‌తో పాటు బీఏ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. విద్యాభాసం పూర్తయిన తర్వాత 1961 నుంచి కొంతకాలంపాటు ఢిల్లీ యూని వర్సిటీలో న్యాయ విద్యను బోధించారు. 1967లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన పీపీ రావు.. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ వాదిగా పేరు గడించారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో పాటు పలు చారిత్రాత్మకమైన కేసులను ఆయన వాదించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రముఖ న్యాయవాదులు రాంజెఠ్మలానీ, శాంతిభూషణ్ సవాల్ చేయగా.. పీపీ రావు వారి వాదనలను సమర్థంగా తిప్పికొట్టారు. 1991లో ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసి యేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తదనంతర కాలంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 2014లో లోక్‌పాల్ సెలక్షన్ కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. కాగా, నాలుగు నెలల కిందట గుండెపోటు రావడంతో వైద్యుల సలహా మేరకు ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
బుధవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని వెంటనే సమీపంలోని ఇండియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలను గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కోడలు, సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి పావని తెలిపారు. కాగా, పీపీ రావు మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరవ్ భాటియా బుధవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
జగన్ సంతాపం
సీనియర్ న్యాయవాది పావని పరమేశ్వర రావు మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. పీపీ రావు న్యాయవాదిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియా డారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలు, వివిధ కమిటీల ద్వారా ఆయన నిర్వహించిన పాత్ర ఎనలేనిదన్నారు. పీపీ రావు కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.