సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. కొందరు నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. తన మాటకు విలువలేదని కొందరు, చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు గుర్తింపు కరువైందని మరికొందరు ఇలా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా సీనియర్ నాయకురాలు సూర్యకాంత పాటిల్ పార్టీ పదవులతోపాటు పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా మూర్బాడ్ ఎమ్మెల్యే కథోర్ కూడా రాజీనామా బాటపట్టారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు కుదరకపోవడంతో కొందరు పార్టీని విడిచి ప్రత్యామ్నాయం చూసుకునే పనిలో పడుతున్నారు.
రాజీనామా బాటలో..
మాజీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకురాలు సూర్యకాంత పాటిల్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అందజేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నాందేడ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వం తనపై చిన్నచూపు చూస్తోందని, పార్టీలో తనని విశ్వాసంలోకి తీసుకోకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. పార్టీలో తనకు విలువ, ప్రాధాన్యత లేనప్పుడు ఇమడలేనని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడూ అవమానాలను ఎదుర్కొలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నిల సమయంలో ఎన్నికల ప్రచార పనుల్లో నిమగ్నం కావాలని పవార్ తనకు స్వయంగా సూచించారు.
దీంతో తనకు అభ్యర్థిత్వం ఖాయమని భావించాను. వెంటనే తన నియోజక వర్గం మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను వదులుకున్నామని ఎన్సీపీ అధినాయకత్వం ప్రకటించడం వెనక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. ఇటీవల తను బీజేపీ నాయకులతో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని అన్నారు. ఇతర పార్టీలు స్వాగతిస్తున్నాయని, కానీ ఏ పార్టీలో చేరతాననేది త్వరలో ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కిషన్ కథోరే రాజీనామా
ముర్బాడ్ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, కొంకణ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు కిషన్ కథోరే ఎన్సీపీకి రాజీనామా చేశారు. త్వరలో విధాన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో కలిసి పనిచేస్తున్నాను. కానీ పార్టీలో గిట్టని కొందరు తనకు వ్యతిరేకంగా పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజం చేయడానికి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ క్యాడర్‌తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే ధ్యేయంగా ముందుకుసాగాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని కోరారు. డిప్యూటీ సీం అజిత్ పవార్, చగన్ భుజ్‌బల్, సునిల్ ఠాక్రే పాల్గొని కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు.
ఎన్సీపీలో ముసలం
Published Mon, Aug 25 2014 11:26 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement