భివండీలో తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ‘సేవా’ సంస్థ నేతృత్వంలో ఆదివారం స్వచ్ఛ్ భివండీ నిర్వహించారు.
భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ‘సేవా’ సంస్థ నేతృత్వంలో ఆదివారం స్వచ్ఛ్ భివండీ నిర్వహించారు. ప్రధాన నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ను ప్రేరణగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవ) నేతృత్వంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘సేవ’తో పాటు పట్టణంలోని తెలుగు సేవా సంస్థలు నటరాజ్ మిత్ర మండల్, ఫ్రీడమ్ గైస్, ఓంకార్ మిత్ర మండల్, వినాయక్ మిత్ర మండల్, శ్రీ గజానన్ మిత్ర మండల్, మార్కండేయ మిత్ర మండల్, ఏక్తా మిత్ర మండల్, నవజావన్ చారిటబుల్ పాఠశాల, వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో అన్ని వర్గాలకు చెందిన 15 నుంచి 70 యేళ్ల మధ్య వయస్కులు పాల్గొనడం విశేషం. పద్మనగర్ ప్రాంతంలోని వార్డు నంబర్ 31,32 ల్లోని మార్కండేయ నగర్, గణేశ్ టాకీస్, రామ మందిరం, దత్తా మందిర్, బాలాజీ సొసైటీ, సోనార్ పాడ, మార్కండేయ మహాముని చౌక్, నీలకంఠేశ్వర మందిరం, గాయిత్రీ నగర్, మిలింద్ నగర్, జూనా పక్కుల్ చాల్, అలంకార్ టాకీస్, పక్కుల్ చాల్, రాజు చాల్, ధర్మచాల్, బోబుడే కంపౌండ్, యశ్వంత్ చాల్, జై భారత్ వ్యాయామశాల, వరాలదేవి రోడ్, గీతా మందిర్ రోడ్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు.
అంతేగాకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతపై స్థానిక తెలుగు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్పొరేషన్ గత ఐదు నెలల నుంచి గంటా గాడీలను నిలిపివేయడంతో రోడ్డు ఇరుపక్కల వీధివీధినా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఉన్నాయి. ఈ విషయంపై కార్పొరేషన్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో శనివారం నుంచి తిరిగి గంటా గాడీలను ప్రారంభించారు.
ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ గంటా గాడిలోనే చెత్త వేయవలసిందిగా సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు రామ మందిరం ప్రాంగణంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు.