సీతాపూర్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకవడంతో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందిన ఘటన గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా మృతి చెందినవారిలో ముగ్గరు పిల్లలు ఉన్నట్లు తేలింది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని తమ పరిధిలోకి తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. జిల్లా ఎస్పీ ఎల్‌ఆర్ కుమార్ మాట్లాడుతూ.. బిస్వాన్ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే పేలుడు జరిగిన ప్రదేశం పక్కనే కార్పెట్ తయారీ కంపెనీ ఉండడంతో వాటికి మంటలు అందుకొని దట్టంగా పొగలు అలుముకున్నాయి. కాగా కార్పెట్ కంపెనీని ఆనుకొని ఏడుగురు పడుకొని ఉన్నారని , మంటలు వేగంగా వ్యాపించడంతో వారికి మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న తాము లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పొగలు కమ్ముకొని దుర్వాసన రావడంతో మృతదేహాలను బయటికి తీయడంలో ఇబ్బందులకు గురయ్యామని ఎస్పీ వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ. 4లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment