మాంసం తినే సాయి.. హిందూ దేవుడెలా?
షిరిడీ సాయి దైవత్వాన్ని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి ప్రశ్నించారు. అల్లాను కొలుస్తూ.. మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని ఆయన అన్నారు. సాయి భక్తులు కూడా సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని, వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని.. అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద అన్నారు. తాము కేవలం ఐదుగురు దేవుళ్లనే ఆమోదిస్తామని, వేరే ఎవరైనా తమను తాము అక్కడ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆమోదించేది లేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తాను సాయిబాబాపై గళమెత్తానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయవాదిని కానని స్పష్టం చేశారు. మరోవైపు నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు.