సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా బీజేపీ రాజకీయాలతో విసిగెత్తిపోయిన శివసేన ఇక హిందుత్వవాదంపై బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ‘శివ్ ప్రతాప్ దిన్’ ఆర్భాటంగా నిర్వహించాలని నిర్ణయిం చింది. అంతటితో ఆగకుండా ప్రతాప్‌గఢ్ (కోటా) మెట్ల వద్ద వివాదాస్పద అఫ్జల్‌ఖాన్ సమాధి దగ్గరున్న అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది.
అప్పట్లో జరిగిన యుద్ధంలో అఫ్జల్‌ఖాన్‌ను ప్రతాప్‌గఢ్ వద్ద శివాజీ కత్తితో పొడిచి హతమార్చారు. ఈ పరాక్రమానికి గుర్తుగా ఏటా హిందుత్వ సంఘాలు ఈ కోట వద్ద శివ్ ప్రతాప్ దిన్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించే అఫ్జల్‌ఖాన్‌కు సంబంధించిన బ్యానర్లు వివాదస్పదమవుతున్నాయి. బీజేపీని ఇబ్బందుల్లో పెట్టేందుకు శివసేన ఈసారి ఈ వేడుకలను మరింత ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. కాగా, అఫ్జల్‌ఖాన్ సమాధి పక్కనున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని ఇదివరకే సుప్రీం కోర్టు ఆదేశించిందని మంగళవారం విలేకరులతో శివసేన నాయకుడు, ఎమ్మెల్యే దివాకర్ రావుతే తెలిపారు.
కాని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దాన్ని కూల్చివేసే సాహసం చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది శివాజీ ఆశీర్వాదంతో శివ్ ప్రతాప్ దిన్ నాడు ఆ కట్టడాన్ని నేలమట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను బీజేపీ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో శివసేన ఆందోళన మరింత తీవ్రతరం చేస్తుందని రావుతే హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు మరాఠీ పాఠశాలల్లో ఉర్దు సబ్జెక్టును అప్షనల్‌గా ఉంచాలని ఖడ్సే చేసిన ప్రకటనపై శివసేన రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. అఫ్జల్‌ఖాన్ సమాధి పక్కనున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేసే అంశాన్ని తెరమీదకు తెచ్చి మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
కూల్చేయడం ఖాయం..
Published Tue, Nov 11 2014 10:37 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
Advertisement