'ఒక్క బీజేపీ వల్ల అది సాధ్యం కాదు'
'ఒక్క బీజేపీ వల్ల అది సాధ్యం కాదు'
Published Sat, May 21 2016 7:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ముంబై: మిత్రపక్షమైన బీజేపీపై శివసేన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఐదు రాష్ట్రాల ఫలితాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవడానికి తప్పుడు ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది. 'కాంగ్రెస్ ముక్త భారత్' మంచి లక్ష్యమే అయినా అది ఒక్క బీజేపీ వల్ల సాధ్యం కాదని తన పార్టీ అధికార పత్రిక సామ్నాలో శివసేన పేర్కొంది.
'అస్సాంలో బీజేపీ విజయం సాధించింది. కేరళను లెప్ట్ ఫ్రంట్ దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. తమిళనాడులో ఏఐడీఎంకే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్, డీఎంకే కూటమి పుదుచ్చేరిలో అధికారం సాధించింది. కానీ బీజేపీ అన్ని రాష్ట్రాల ఫలితాలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోంది' అని శివసేన విమర్శించింది.
ఎన్డీఏ నేతృత్వంలోని రెండేళ్ల ప్రభుత్వానికి ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. నరేంద్రమోదీ విధానాలను నాలుగు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్టింటన్ లలో ఎవరైనా అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా, నవాజ్ షరీఫ్ తన కార్యాలయానికే పరిమితమైనా అది కూడా మోదీ ఘనతగా చెప్పుకుంటారా అని బీజేపీని ఎద్దేవా చేసింది.
Advertisement