ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు పరోక్ష హెచ్చరికలు చేశారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. అంతేకాదు తన గురువు, శివసేన ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిఘే విషయంలో ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2002లో రోడ్డు ప్రమాదానికి గురై ఆనంద్ దిఘే మరణించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు శివసేన రెబల్ ఎమ్మెల్యేలను థాక్రే ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు. మరి సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ సిద్ధాంతాలను పక్కనపెట్టిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. 288 సీట్లకు గాను 200కుపైగా స్థానాలు కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు.
చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే
Comments
Please login to add a commentAdd a comment