సాక్షి, ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై అయిదుగురు అర్బన్ నక్సల్స్ అరెస్ట్‌లో మహారాష్ట్ర పోలీసుల తీరును శివసేన తప్పుపట్టింది. ప్రధాని మోదీని రాజీవ్ గాంధీ హత్య తరహాలో చేపట్టేందుకు వారు కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అర్బన్ నక్సల్స్ అరెస్ట్‌కు పోలీసులు చూపుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవన్నారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ సర్కార్‌ను ప్రజలు సాగనంపారని..మావోయిస్టులు కాదని పేర్కొంది.
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. పూణే పోలీసుల ప్రకటన హాస్యాస్పదంగా ఉందని, అర్బన్ నక్సల్స్ అరెస్ట్‌పై పోలీసులు చౌకబారు ప్రకటనలను చేయకుండా ప్రభుత్వం నియంత్రించాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ఇక రాజీవ్ తరహాలో ప్రధాని మోదీని మట్టుబెట్టాలనే కుట్ర జరుగుతోందని పూణే పోలీసుల వాదనను సేన అపహాస్యం చేసింది.
రాజీవ్, ఇందిరా గాంధీలు ధైర్యంగా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని, మోదీ అలాంటి సాహసాలు చేయబోరని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే మెరుగైన భద్రత ఆయనకు కల్పించారని, మోదీ మీదుగా కనీసం పక్షి కూడా ఎగరలేదని పేర్కొంది. ఈ అయిదుగరు మావోయిస్టులకు అంత రాజకీయ ప్రాబల్యం ఉండి ఉంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎన్నడూ అధికారం కోల్పోయేవి కాదని వ్యాఖ్యానించింది. హక్కుల కార్యకర్తలు, మేథావులైన వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతం నవలఖ, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్‌సాల్వ్స్‌ల అరెస్ట్ పట్ల సేన విస్మయం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment