సోనియా, రాహుల్‌కు చుక్కెదురు
‘హెరాల్డ్’ కేసులో సమన్లు రద్దు చేయాలన్న పిటిషన్ల కొట్టివేత
ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. కేసులో తమకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ వారు వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న అభ్యర్థననూ కొట్టివేసింది. దీంతో సోనియా, రాహుల్‌తోపాటు ఈ కేసులో నిందితులుగా సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి మంగళవారం విచారణ కోర్టుకు హాజరుకావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక(కొన్నేళ్ల కిందటే మూతపడింది) ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ 2010లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాత ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)కు కట్టబెట్టింది. ఈ తతంగంలో కాంగ్రెస్ నిధులు మళ్లించి మోసానికి పాల్పడిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చే శారు. విచారించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ఇచ్చింది. నిందితులు వాటిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సునీల్ గౌర్ వారి పిటిషన్‌పై విచారణ చేపట్టారు.
నేర ఉద్దేశం కనిపిస్తోంది..
నిందితుల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందంటూ విచారణ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పూర్తిగా పరిశీలించాక.. వైఐఎల్ ద్వారా ఏజేఎల్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అనుసరించిన పద్ధతులను బట్టి చూస్తే పిటిషనర్లలో నేర ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏజేఎల్, వైఐఎల్ రెండూ ఒకటే. దీన్ని మోసం అనాలో, నేరపూరిత మోసం అనాలో ఈ దశలో చెప్పలేం. పిటిషనర్ల వైఖరి సందేహాస్పదం. నిజాలు తేలాలంటే సరైన దిశలో దర్యాప్తు జరగాలి. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని జడ్జి తన 27 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్లపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. శ్యాంపిట్రోడా, ఫెర్నాండెజ్ విచారణ కోర్టు పరిధిలో నివసించడం లేదని, అందువల్ల వారికి సమన్లు జారీ చేసే అధికారం కోర్టుకు లేదన్న వాదననూ హైకోర్టు తోసిపుచ్చింది.
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు: బీజేపీ
హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. తీర్పు లోపభూయిష్టంగా ఉందని, మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది.
అసలేం జరిగింది?
►నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ రూ. 90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ రూ. 50 లక్షలకు అప్పగించింది.
► ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్‌కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దీని వెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది.
► వైఐఎల్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు చెరో 38శాతం వాటా ఉన్నట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు.
► హెరాల్డ్‌కు ఉన్న ఆస్తులను కేవలం రూ. 50లక్షలకు చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు.
► నేషనల్ హెరాల్డ్ పత్రికకు దేశ వ్యాప్తంగా రూ. 5వేల కోట్లు ఆస్తులు ఉన్నట్లు అంచనా.