
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమ్యాట్) పరీక్షా సమయాన్ని 4 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి రానుందని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (జీమ్యాక్) సీనియర్ డైరెక్టర్ వినీత్ ఛబ్రా తెలిపారు. తాజా విధానంలో జీమ్యాట్ ప్రశ్నల స్థాయి, స్కోరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. క్వాంటిటేటివ్, వెర్బల్ రీజనింగ్ విభాగాల్లో అన్‌స్కోర్డ్, రీసెర్చ్ ప్రశ్నలను తగ్గించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో ట్యుటోరియల్ స్క్రీన్లను తొలగించినట్లు తెలిపారు.
జీమ్యాట్ పరీక్షలో అనలిటికల్ రైటింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ విభాగాల్లో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. పరీక్షా విధానాన్ని మరింత మెరుగుపర్చడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతేడాది జీమ్యాట్ పరీక్షలకు ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల మంది హాజరైతే.. అందులో భారతీయులు 32,514 మంది ఉన్నారని తెలిపారు. ప్రతి 16 పని దినాలకు ఓసారి, మొత్తంగా ఏడాదికి ఐదు సార్లకు మించకుండా విద్యార్థులు జీమ్యాట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఓ అభ్యర్థి తన జీవితకాలంలో గరిష్టంగా 8 సార్లు మాత్రమే జీమ్యాట్ రాయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2,300 బిజినెస్ స్కూళ్లు, ఏడు వేలకుపైగా కోర్సుల్లో జీమ్యాట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment