రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు రావాలి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి లేకుండా సుపరి పాలన జరగాలంటే రాజకీయ వ్యవస్థలో మౌలిక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఎఫ్‌డీఆర్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ‘తక్షణ ఎన్నికల సంస్కరణల’ పై అన్నా హజారే నాయకత్వం లో ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సు లో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో రావా ల్సిన మార్పులపై దేశంలో పార్టీలకు అతీతం గా చర్చ జరగాలన్నారు. సీఎంను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని, అందువల్ల పలు ప్రయోజనాలున్నాయని చెప్పారు.
ఓటు విలువ ప్రజలకు ఇంకా తెలియడంలేదని, అది తెలిస్తే డబ్బుకు అమ్ముడుపోవడం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. సీఎంను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అడ్డుకోలేరని, అందువల్ల స్థానిక ప్రభుత్వాలు బలపడడమే కాకుండా మంచి పరిపాలనకు అవకాశం ఉంటుందని చెప్పారు.రాజకీయం మారాలంటే కుటుంబ వ్యాపారం కాకుండా, రాజకీయమనేది ఒక ప్రైవేట్ సామ్రాజ్యం కాకుండా, మౌలికమైన మార్పులు తెచ్చి సామాన్యులకు ఓటు విలువ తెలిసే పరిస్థితి రావాలని జేపీ అన్నారు.