
కథువా కొత్త ఎస్పీ శ్రీధర్ పాటిల్
కథువా : దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కథువా ఉదంతంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కథువా ఎస్పీని మార్చేశారు. కథువా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ)గా ఉన్న సులేమాన్ చౌదరి స్థానంలో శ్రీధర్ పాటిల్ నియమించారు. దీంతో కొత్త కథువా ఎస్పీగా శ్రీధర్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కథువాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం ఒడిగట్టిన వారికి మరణ శిక్ష విధించేందుకు ఆమోదిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను సైతం తీసుకొచ్చింది.
ఈ ఘటనలో స్థానిక పోలీసులదే కీలక పాత్ర కావడంతో, ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేపట్టడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. దీంతో ఈ కేసును జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచు పోలీసులు ఈ కేసుపై ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీటులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్‌ను ఏ1గా పేర్కొన్నారు. సాంజీరామ్ మేనల్లుడు( మైనర్), మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వీరిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం కథువా కేసు విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కొత్త ఎస్పీని నియమించడంపై చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment