ఈ పిల్లల పెద్ద మనసు నిజంగా బంగారం
భోపాల్: ఒక విజన్ ఉన్న వాళ్లే గొప్పగా ఆలోచిస్తారు.. పదిమందిని ఆకర్షిస్తారు.. వారు వెచ్చించే ప్రతి పైసా భౌతికంగా నిలిచి పదిమందికి సహాయకారిగా నిలుస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలకు డబ్బులిస్తే చాకెట్లు వగైరా కొనుక్కోని తింటుంటారు. కొంచెం కాలేజీకి పోయే స్టేజీలో ఉన్నవారికి ఇస్తే ఏం చక్కా సినిమాలు షికార్లు, బేకరీలు బర్గర్లు అంటూ తెగ సందడి చేసి ఖర్చు చేసేస్తారు. కానీ, మధ్యప్రదేశ్లో ఓ అక్కా తమ్ముడు మాత్రం చిన్నతనంలోనే మంచి విజన్ ఉన్న వ్యక్తుల్లా ఆలోచించారు. తమకు ఖర్చులకోసం ఇచ్చిన డబ్బును పొదుపు చేసి ఓ స్కూల్లో టాయిలెట్ నిర్మించారు.
వివరాల్లోకి వెళితే మెమూనా ఖాన్ (16), అమిర్ ఖాన్ (14) అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లు. మెమూనా 11వ తరగతి, అమీర్ 10వ తరగతి చదువుతున్నారు. వారికి మైనారిటీ కమ్యునిటీ నుంచి వారికి ఉపకార వేతనం వచ్చింది. దానికి వారిదగ్గర పొదుపుగా దాచుకున్న రూ.2000 కలిపి మొత్తం తీసుకెళ్లి నర్సింగ్ పూర్ లోని మహారాణి లక్ష్మీ బాయి గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో టాయిలెట్ నిర్మించారు.
'ఆ స్కూల్లో ఒకటే టాయిలెట్ ఉండేది. ప్రతి రోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. అది చూసి చాలా బాధేసింది. అందుకే మాస్కాలర్ షిప్పునకు మా దగ్గర ఉన్న రూ.2వేలు జతచేశాం. మొత్తం పది వేలు అయ్యాయి. మా ఆలోచన మా నాన్నతో చెప్పగా ఆయన ప్రోత్సహించి మరో 14,500 జత చేసి తమతో కలిసిపోయారు. అందరం కలిసి ఈ పని చేశాం. మాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ఆ ఇద్దరు పిల్లలు తాము చేసిన పనిని గర్వంగా చెప్పుకున్నారు.