సర్కారీ స్కూళ్లా? లేక మద్యం షాపా?
విరిగిన గేట్లు...ఊడిన తలుపులు
బడి ఆవరణలో మద్యం సీసాలు.. సిగరెట్ పీకలు
అపరిశుభ్రంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు
స్వీపర్లుగా మారిన చిన్నారులు
సర్కారు బడుల్లో ‘తొలి రోజు’ దృశ్యాలివే...
సాక్షి విజిట్‌లో వెలుగుచూసిన సమస్యలు...
సిటీబ్యూరో: విరిగిన గేట్లు.. ఊడిన తలుపులు.. కంపుకొడుతున్న మరుగుదొడ్లు, మూత్రశాలలు.. చెత్తా చెదారంతో నిండుకున్న ఆవరణాలు.. దుమ్ము పట్టిన బెంచీలు. వేసవి సెలవుల తర్వాత కొండత ఆశతో సర్కారు బడి గడప తొక్కిన విద్యార్థులకు తొలి రోజు ఎదురైన స్వాగత తోరణాలవి. విద్యా సంవత్సరం మారినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. వేసవిలో మరమ్మతులు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడంతో.. విద్యార్థులు అవస్థలు పడ్డారు. చివరకు తరగతి గదులూ ఊడ్చేనాథుడు లేక.. విద్యార్థులే చీపుర్లు చేతబట్టిన దృశ్యాలు కనిపించడం విచారకరం. మరోపక్క ప్రైవేటు పాఠశాలలు కొత్త హంగులు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాయి. ‘వెల్‌కమ్ బ్యాక్ టు స్కూల్’ అంటూ సాదరంగా విద్యార్థులను ఆహ్వానించాయి. ఇందుకు భిన్నంగా సర్కారు బడులు.. సమస్యలతో వెక్కిరించడంతో విద్యార్థులకు నిట్టూర్పే మిగిలింది. జంట జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నిర్వహించిన ‘సాక్షి’ విజిట్‌లో పలు సమస్యలు వెలుగుచూశాయి....
స్వచ్ఛ స్ఫూర్తి ఏది..?
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 11న తేదీన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది తూతూమంత్రంగా కొనసాగిందనడానికి సోమవారం బడుల్లో కనిపించిన దృశ్యాలే సాక్ష్యం. సింహభాగం పాఠశాలల్లో స్వచ్ఛ స్ఫూర్తి కనిపించలేదు. తరగతి గదుల్లో చెత్తాచెదారం పేరుకపోయింది. బెంచీలు దుమ్ముపట్టి ఉండడంతో విద్యార్థులే తుడుచుకుని సర్దుకపోయారు. చివరకు కొన్ని బడుల్లో పిల్లలే గంట మోగించారు. మరోపక్క మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రతకు చిరునామాగా నిలవడంతో.. ఆరుబయటి బాట పట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెంచీలు లేకపోవడంతో.. నేలపై కూర్చున్నారు. తరగతి గదుల కొరతతో.. నాలుగైదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో గడిపారు. కొన్ని బడుల్లో రూ. లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్లు చెడిపోయినా.. బాగుచేయలేదు. పలు పాఠశాలలు అసాంఘిక కార్యక లాపాలకు అడ్డాలుగా మారినా.. అధికారులు ఏం చేయలేక పోతున్నారు.
బలపం పట్టిన చిన్నారులు..
అన్ని సర్కారు బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టారు. కొన్ని స్కూళ్లలో అనూహ్య స్పందన రాగా.. మరికొన్నింటిలో విద్యార్థుల జాడ కరువైంది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు దగ్గరుండి విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. ఈనెల 7 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్ జిల్లాలో 4,923 మంది చిన్నారులు కొత్తగా బడిబాట పట్టారు. 13వ తేదీన ఒక్కరోజే 2,645 మంది తమ పేర్లను నమోదు చేయడం విశేషం. ఇక తొలిరోజు దాదాపు అన్ని పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు అందచేశారు. ఇది కాస్త సంతోషించాల్సిన విషయంగా చెప్పొచ్చు.
మద్యం సీసాలు.. సిగరెట్ పీకలు
అంబర్‌పేట/నాగోలు: గోల్నాక గంగానరగ్‌లోని ఉన్నత పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో చేసేదేమీలేక విద్యార్థులు సర్దుకుపోవాల్సి వచ్చింది. మద్యం బాటిళ్లు, కాల్చిన సిగరేట్ పీకలు మొదటి అంతస్తు మెట్లపై దర్శనమిచ్చాయి. ఇక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాల ముందు ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్ దర్శనమివగా.. మరో ప్రాథమిక పాఠశాల ముందు చెత్త డంపింగ్‌యార్డు ఉంది. అలాగే సీపీఎల్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో గతేడాది అదనపు భవనం కోసం తవ్విన గుంతలు ఇప్పటికి అలాగే ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు హజరయ్యారు. నాగోలు డివిజన్ ఫతుల్లాగూడలో సరైన ప్రహారీ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు పానశాలగా మారింది. పాఠశాలకు వెళ్లిన పిల్లలకు మద్యం సీసాలు కనిపించడంతో అవాక్కయ్యారు.