సింగూరు భూములు వాపస్
పట్టాలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం మమత
సింగూరు: పశ్చిమబెంగాల్‌లోని సింగూరులో టాటా నానో కారు ప్లాంటు కోసం పదేళ్ల కిందట సేకరించిన భూమిని సీఎం మమతాబెనర్జీ బుధవారంఆయా భూముల రైతులకు తిరిగి అప్పగించారు. పట్టాలు, పరిహారానికి సంబంధించిన చెక్కలను బుధవారమిక్కడ పంపిణీ చేశారు. అదే సమయంలో.. రాష్ట్రంలో ఆటోమొబైల్ ప్లాంటు స్థాపించాలనుకున్న ఏ సంస్థనైనా ఆహ్వానిస్తామంటూ పరోక్షంగా టాటా పరిశ్రమకు సందేశమిచ్చారు. 2006లో టాటా నానో ప్రాజెక్టు కోసం అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం జరిపిన భూసేకరణపై రైతుల ఆందోళనకు మమత సారథ్యం వహించడం తెలిసిందే. ఆ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందని, అది ప్రజోపయోగం కోసం జరిపిన భూసేకరణ కాదని, యజమానులకు 12 వారాల్లోగా తిరిగి అప్పగించాలని సుప్రీంకోర్టు గత ఆగస్టులో తీర్పివ్వడం విదితమే.
మమత.. 9,117 మంది రైతులకు పట్టాలు, 806 మందికి పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. భూమిని తిరిగి ఇస్తానన్న తన హామీని అమలు చేయటం పట్ల సంతోషంగా ఉందన్నారు. అలాగే.. ఇప్పటివరకూ నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి సాగులోకి తెచ్చుకోవటం కోసం రైతులకు రూ. 10,000 చొప్పున నగదూ ఇస్తామన్నారు. అదే సమయంలో.. ‘మాకు పరిశ్రమలు కావాలి. కానీ బలవంతపు భూసేకరణ ద్వారా కాదు’ అని పేర్కొన్నారు. ‘మీరు ఆలోచించండి. గోల్తోర్(మిడ్నాపూర్ జిల్లాలో) 1,000 ఎకరాలు ఇస్తాం. టాటాలు లేదా బీఎండబ్ల్యూ ఎవరైనా ఆటో పరిశ్రమ స్థాపించాలనుకుంటే.. స్వాగతం’ అని అన్నారు. భూమి మళ్లీ తమకు సొంతం కావడంతో సింగూరు రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం నుంచి పట్టాలు అందుకున్న రైతులు నృత్యం చేశారు.