సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఖరారు అవుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 2004లో వచ్చిన ఫలితాలే మరోసారి రానున్నాయని, వారి తల రాతలో ఓటమి రాసిపెట్టి ఉందని జోస్యం చెప్పారు. కేవలం ప్రధాని మోదీ వల్ల బీజేపీ ఓటమి చవిచూడబోదని.. ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే ఎన్డీయేకు చెంపపెట్టులా మారతాయని వ్యాఖ్యానించారు.
అదే రిపీట్ అవుతుంది...
‘మోదీకి పోటీ ఎవరు అని ఈరోజు బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. 2004లో కూడా వాజ్‌పేయికి పోటీ ఎవరు అంటూ అతి విశ్వాసం ప్రదర్శించారు. ఫలితం ఏమైందో మనందరికీ తెలిసిందే. 2019లో అదే పునరావృతం అవుతుంది ’అని సీతారాం వ్యాఖ్యానించారు. కాగా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని అడగగా...‘ స్టాలిన్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. కానీ మేము ఆయనతో ఏకీభవించలేం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని ఖరారు చేయాలనేది మా అభిమతం’ అని సీతారం పేర్కొన్నారు. ఇక బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో, సీపీఎం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment