రాహుల్ ఒక విఫల రాజవంశీయుడు...
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. రాహుల్ ఒక విఫల రాజవంశీయుడని విమర్శించారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో తన విఫల రాజకీయం గురించి చెప్పుకోవడమే దారుణమని, విదేశాల్లో ప్రధాని నరేంద్రమోదీని తక్కువ చేస్తూ మాట్లడటంసహించరానిదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
భారత్‌లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను చూస్తే కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయా లేదా అన్నది రాహుల్‌కు అర్ధమవడం లేదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లోనే భారత ప్రజలు గాంధీ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పట్టారని, ప్రధాని నరేంద్రమోదీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా ఆమె స్పష్టంచేశారు. అంత పెద్ద వేదికపై నేతల అహంకారమే కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని రాహుల్ అనడమే దారుణమని స్మృతి ఇరానీ విమర్శించారు.